నాలుగోసారి పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణం

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్(AINRC)అధినేత ఎన్ రంగ‌సామి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

నాలుగోసారి పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణం

N Rangasamy

N Rangasamy కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్య‌మంత్రిగా ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్(AINRC)అధినేత ఎన్ రంగ‌సామి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇన్‌చార్జ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా,ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో..మొత్తం 30 స్థానాలకుగాను ఎన్డీయే కూటమి 16 స్థానాలు సాధించింది. ఎన్‌డీఏ కూటమిలోని ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 10, బీజేపీ 6 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. ఈ కూటమిలోని కాంగ్రెస్‌కు రెండు, డీఎంకేకు ఆరు స్థానాలు లభించాయి. ఇక,మరో ఆరుగురు స్వతంత్రులు సభకు ఎన్నికవగా.. వారంతా రంగస్వామి మద్దతుదారులే.

ఇక,ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలనుంచి రంగస్వామి పోటీ చేసిన విషయం తెలిసిందే. యానాం,తట్టన్ చవాడీ నియోజకవర్గాల నుంచి రంగస్వామి పోటీ చేయగా..యానాంలో ప్రత్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ పై 656ఓట్ల తేడాతో ఓడిపోయారు.తట్టన్ చవాడీ నియోజకవర్గంలో రంగస్వామి 5456ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.

కాగా, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. రంగ స్వామి 2001లో మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆ తర్వాత 2006లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గ సహచరులతో భేదాభిప్రాయాలు రావడంతో 2008లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.