సాంబార్‌లో బల్లి: ప్రముఖ హోటల్ మూసేశారు 

  • Published By: vamsi ,Published On : May 16, 2019 / 07:44 AM IST
సాంబార్‌లో బల్లి: ప్రముఖ హోటల్ మూసేశారు 

బల్లిని చూస్తేనే ఇబ్బంది పడుతూ ఉంటాం. అది ఎక్కడ తినే పదార్థాలలో పడుతుందో అని బయపడుతుంటాం. అయితే నాగపూర్‌లో ఓ హోటల్ నిర్లక్షం కారణంగా ఆ హోటల్ మూసుకునే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. నాగపూర్‌లో ప్రముఖ బ్రాండ్‌ హోటల్ హాల్ధీరామ్స్‌లో మంగళవారం(14 మే 2019) అటువంటి ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉంటే హల్దీ రామ్స్‌ హోటల్లో ఒక కస్టమర్‌కు సర్వ్ చేసిన వడసాంబార్‌లో చనిపోయిన బల్లి కనిపించింది.

మహారాష్ట్రలోని వార్దా జిల్లాకు చెందిన ఓ జంట టిఫిన్ బాగుంటుందని హల్ధీరామ్స్‌కు వచ్చి వడ సాంబారు ఆర్డర్ ఇచ్చారు. సగం తిన్న తర్వాత ఒక్కసారిగా సాంబార్‌లో బల్లి కనిపించడంతో ఇబ్బందిపడ్డారు. బల్లి సాంబార్‌లో పడిందన్న విషయాన్ని హోటల్ సూపర్‌వైజర్ దృష్టికి తీసుకుని వెళ్లి.. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్లారు. సాంబార్‌లో బల్లి పడిన విషయాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ ఫోటో కాస్త వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారికి తెలియడంతో హల్దీరామ్స్ హోటల్ ఔట్‌లెట్‌కు వెళ్లారు.

హల్దీరామ్స్ హోటల్‌లో పరిస్థితులను పరిశీలించిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారి మిలింద్ దేశ్‌పాండే. కిచెన్‌లో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లోని కిటీకిలకు మెష్‌ను ఏర్పాటు చేయలేదని, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం అన్ని సరిగ్గా అయ్యే వరకు హోటల్‌ను మూసివేయాలని ఆదేశించారు. హోటల్‌లో ప్రమాణాలు పాటించిన తర్వాత అధికారులు సంతృప్తి చెందితేనే హోటల్ తిరిగి కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తామని దేశ్‌పాండే వెల్లడించారు.