West Bengal Polls : వీల్ ఛైర్‌లో మమత రోడ్‌షో.. ‘నా ఘర్ కా నా ఘాట్ కా’ సువేందుపై విమర్శలు

వీల్ ఛైర్ లోనే మమత ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా..ప్రత్యర్థిగా మారిన సువేందుపై విమర్శలు సంధించారు.

West Bengal Polls : వీల్ ఛైర్‌లో మమత రోడ్‌షో.. ‘నా ఘర్ కా నా ఘాట్ కా’ సువేందుపై విమర్శలు

Mamata Banerjee (2)

Nandigram roadshow : వెస్ట్ బెంగాల్ లో ఎన్నికల హీట్ మరింత పెరుగుతోంది. ప్రత్యర్థుల విమర్శలతో రచ్చ రచ్చ చేస్తున్నారు నేతలు. అక్కడ పాగా వేయాలని భావిస్తున్న కాషాయ దళం..ప్రధానంగా.. మమతా బెనర్జీని టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న కీలక నేతలు బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. టీఎంసీలో కీలక నేతగా వ్యవహరించిన సువేందు అధికారి బీజేపీలో చేరి..మమత, ఇతర నేతలపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. దీంతో మమత ఎదురు దాడి చేస్తున్నారు. అయితే..ఇటీవలే మమత గాయపడిన సంగతి తెలిసిందే. వీల్ ఛైర్ లోనే ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా..ప్రత్యర్థిగా మారిన సువేందుపై విమర్శలు సంధించారు.

నా ఘర్ కా..నా ఘాట్ కా..అంటూ సైటెర్ వేశారు. 82 ఏళ్ల బీజేపీ పార్టీ కార్యకర్త తల్లి చనిపోవడంపై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని, కేంద్ర హోం మంత్రి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఎదురు ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతమైన యూపీలో మహిళలను హింసించారని ఆరోపించారు. ఆమె ఎలా చనిపోయిందో తనకు తెలియదని, మహిళలపై జరిగే హింసకు తాము మద్దతివ్వబోమని తేల్చిచెప్పారు. తల్లులపై హింసకు కూడా మద్దతు ఇవ్వలేదని పునరుద్ఘాటించారు. అయితే..ఈ విషయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని మమత దుయ్యబట్టారు.

బెంగాల్ కా క్యా హాల్ హై అని షా చెబుతున్నారని, యూపీలోని హత్రాస్ లో మహిళలపై దాడి చేసిన తరుణంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటారని ప్రశ్నించారు. మన సంస్కృతికి పాతరేసేందుకు వారికి అవకాశం ఇవ్వకూడదని, తాను తన పేరును మర్చిపోయినా నందిగ్రామ్‌ను మాత్రం మరువనన్నారు. మరోవైపు మమతా బెనర్జీ మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేత, నందిగ్రామ్‌లో దీదీ ప్రత్యర్ధి సువేందు అధికారి విమర్శలు చేశారు.

మమత బెనర్జీ ఆధ్వర్యంలో కార్యకర్తలు సోమవారం నందిగ్రామ్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. సువేందు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీఎంసీ నాయకులతో కలిసి..మమత..తన వీల్ ఛైర్ లో సుమారు 8 కిలోమీట్లర రోడ్ షో నిర్వహించారు. చేతులతో అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. భారీగా ప్రజలు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. మొత్తం 8 దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27వ తేదీన ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి.