నారదా కుంభకోణం కేసు.. ఆ నలుగురు టీఎంసీ నేతలకు బెయిల్
నారదా కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఓ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలకు బెయిల్ లభించింది.

Narada Sting Case
Narada sting case నారదా కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు బెంగాల్ మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఓ ఎమ్మెల్యే మదన్ మిత్రా, మాజీ మంత్రి సోవన్ ఛటర్జీలకు బెయిల్ లభించింది. ఈ నలుగురిని సీబీఐ కస్టడీకి కోరగా.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి బెయిల్‌కు అంగీకరించారు.
నారదా కుంభకోణం కేసులో నలుగురు టీఎంసీ నేతలను సోమవారం ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల గవర్నర్ జగదీప్ ధన్కర్ హకీం సహా తృణమూల్ సీనియర్ నేతలపై నారదా స్కామ్‌కు సంబంధించి విచారణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2016లో కలకలం రేగిన నారదా కుంభకోణంపై సీబీఐ.. ఈ అరెస్టులతో జోరు పెంచింది. ఈ ఉదయం.. కేంద్ర బలగాలతో బంగాల్ రవాణా మంత్రి హకీం నివాసానికి చేరుకున్న సీబీఐ బృందం ఆయనను తమ కార్యాలయానికి తరలించింది. ఆ తర్వాత టీఎంసీ ప్రజాప్రతినిధులను అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
ఈ అరెస్టులకు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు కోల్ కతాలోని నిజాం ప్యాలెస్ వద్దనున్న సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.తృణమూల్ మద్దతుదారులు లాక్డౌన్ ఆంక్షలు పక్కన పెట్టి మరీ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఓ పద్ధతి లేకుండా తమ మంత్రులను అరెస్టు చేసినట్లు ఆరోపించిన మమత.. తనను కూడా అరెస్టు చేయండంటూ మండిపడ్డారు. దాదాపు 6 గంటల తర్వాత అక్కడినుంచి ఆమె వెనుదిరిగారు. కేవలం గవర్నర్ అనుమతితో.. సీబీఐ అధికారులు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయటం అనైతికమని బెంగాల్ స్పీకర్ పేర్కొన్నారు.
నారదా కుంభకోణం ఏంటీ
కల్పితంగా సృష్టించిన కంపెనీల ప్రతినిధుల నుంచి కొందరు రాజకీయ నాయకులు లంచం తీసుకుంటున్నారనే అభియోగాలతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నారదా టీవీ ఛానెల్ 2014లో చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాలతో 2017 మార్చిలో దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. టీఎంసీకి చెందిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు ఈ ఆపరేషన్ చేపట్టిన మ్యాథ్యూ శ్యామ్యూల్ పేర్కొన్నారు. వీరు డబ్బు తీసుకుంటున్న వీడియో 2016 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బయటకు విడుదలైంది.