National Lockdown, just not in name : 98 శాతం భారత్ లాక్ డౌన్

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి.

National Lockdown, just not in name : 98 శాతం భారత్ లాక్ డౌన్

National Lockdown, Just Not In Name

national lockdown కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. గతేడాది మార్చి లో కరోనా మొదటి వేవ్ సమయంలో విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ లా కాకుండా, ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ లో భారతదేశం అధికారికంగా జాతీయ లాక్ డౌన్ ప్రకటించలేదు. జాతీయ లాక్ డౌన్ లేనప్పటికీ.. దేశంలోని దాదాపు 98 శాతం రోజువారీ జీవితం ఇప్పటికే ఏదో ఒక విధంగా పరిమితం చేయబడింది. దేశవ్యాప్త లాక్​డౌన్ ని కేంద్రప్రభుత్వం విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది.


లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?

తెలంగాణలో బుధవారం(మే-11,2021) నుంచి 10 రోజుల పాటు లాక్​డౌన్ అమలు కానుంది. లాక్​డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది. ఇక, ఢిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను రద్దు చేశారు. హర్యాణాలో ఈనెల 17 వరకు లాక్​డౌన్ పొడిగించారు. బీహార్‌లో ఈ నెల 15 వరకు లాక్​డౌన్ కొనసాగనుంది. తమిళనాడు, రాజస్తాన్, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరంలో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్​డౌన్ అమల్లోకి రానుంది. వారం పాటు సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది.

కర్ఫ్యూ
గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు. అసోంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌… సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది. మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది. హిమాచల్‌ప్రదేశ్‌ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది. పశ్చిమ బెంగాల్​లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.


వీకెండ్ లాక్ డౌన్

చండీగఢ్‌లో వీకెండ్ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. మే 11నుంచి మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్​డౌన్​ను కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.

లాక్ డౌన్ తరహా కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్​డౌన్ తరహా కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చింది. మే 5న ప్రారంభమైన ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు. నాశిక్​లో మే 12 నుంచి 23 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూను ఈనెల 17 వరకు పొడిగించారు. జార్ఖండ్‌లో ఈనెల 13 వరకు పొడిగించారు. కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు. సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది. లేహ్​లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించారు.