19న లారీల సమ్మె : మోటార్ వెహికల్ యాక్ట్ ఎఫెక్ట్

  • Published By: madhu ,Published On : September 18, 2019 / 07:25 AM IST
19న లారీల సమ్మె : మోటార్ వెహికల్ యాక్ట్ ఎఫెక్ట్

కొత్త మోటార్ వెహికల్ యాక్టు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని లారీల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 19వ తేదీ గురువారం దేశ వ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటార్ ట్రాన్స్ పోర్టు పిలుపునిచ్చింది. చిన్న చిన్న ఉల్లంఘనలకు భారీ ఫైన్‌లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీల సమ్మెతో నిత్యావసర సరుకులు, ఇతర రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

సెప్టెంబర్ 01వ తేదీ నుంచి మోటార్ వెహికల్ యాక్టు అమల్లోకి తీసుకొచ్చింది కేంద్రం. కొన్ని రాష్ట్రాల్లో ఇవి ఇంకా అమలు కావడం లేదు. మరికొన్ని రాష్ట్రాలు జరిమానాలను తగ్గించి వేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అమలు కావడం లేదు. అయితే..ఇతర రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో నిబంధనలు పాటించడం లేదని భారీగా ఫైన్లు వేస్తున్నారని లారీల డ్రైవర్లు, యజమానులు వెల్లడిస్తున్నారు.

బీమా ప్రీమియం, జీఎస్టీ వంటివి లారీ పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయని తెలిపారు. లారీ పరిశ్రమపై పెను ప్రభావం చూపిస్తున్న ఎంవీ యాక్టు 2019 బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలని, కొత్త – పాత వాహనాల కొనుగోలుపై జీఎస్టీని తగ్గించాలని కోరుతున్నారు. అలాగే రవాణా రంగంలో ఏటా రూ. కోటి నగదు విత్ డ్రాపై 2 శాతం వసూలు నిలిపివేయాలంటున్నారు. 

ఇప్పటికే పెరుగుతున్న డీజిల్ ధరలతో సతమతమౌతున్నామని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. టోల్ ప్లాజా రుసుం, కొత్త ట్రాఫిక్ చలాన్లతో, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్..ఇతరత్రా వాటితో తాము సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. సుమారు 45 లక్షల లారీలు సమ్మెలో పాల్గొనున్నాయని అంచనా.