Odisha CM : వ్యాక్సినేషన్ పై అన్ని రాష్ట్రాల సీఎంలకు పట్నాయక్ లేఖ

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు.

Odisha CM : వ్యాక్సినేషన్ పై అన్ని రాష్ట్రాల సీఎంలకు పట్నాయక్ లేఖ

Odisha Cm

Odisha CM ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రానున్న కొవిడ్ వేవ్ ల నుంచి ప్రజలను రక్షించేందుకు వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. అయితే కొవిడ్-19 వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో బుధవారం అన్ని రాష్ట్రాల,కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులకు నవీన్ పట్నాయక్ ఓ లేఖ రాశారు. వ్యాక్సిన్ కొనుగోలులో రాష్ట్రాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నందున కేంద్ర ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసేలా అందరూ ఏకాభిప్రాయానికి రావాలంటూ ఆ లేఖలో పట్నాయక్ కోరారు. కానీ, వ్యాక్సినేషన్‌ విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలని అన్నారు.

స్వాతంత్యం సాధించిన తర్వాత భారత్‌ ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య ఇదేనని పట్నాయక్ లేఖలో తెలిపారు. ఈ మహమ్మారి నుంచి ప్రజల విలువైన ప్రాణాలు కాపాడేందుకు.. విబేధాలు,రాజకీయాలు పక్కనబెట్టి కేంద్రంతో కలిసి నడుస్తూ సహకార సమాఖ్యవాద స్ఫూర్తిని చాటాలని ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో నవీన్‌ పిలుపు నిచ్చారు. గడచిన సంవత్సరం నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ కరోనా ప్రభావానికి గురయ్యాయని… చాలా దేశాల్లో అనేకమార్లు ఇన్ఫెక్షన్ వేవ్‌ లు వచ్చాయని.. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదన్నారు. ఇప్పటికే మనం రెండు వేవ్‌లు చూశాం అని, ప్రత్యేకించి సెకండ్ వేవ్ కల్లోలం తర్వాత.. భవిష్యత్తులో తలెత్తే వేవ్‌లు, వేరియంట్లపై ప్రజల్లో భయాందోళన నెలకొందని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌కు ప్రథమ ప్రాథాన్యత ఇవ్వని పక్షంలో ఏ రాష్ట్రమ సురక్షితంగా మనుగడ సాగించలేదనీ.. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తిచేయాల్సి ఉందని.. అయితే వ్యాక్సిన్ల కొనుగోలు అంశం రాష్ట్రాల మధ్య చిచ్చు రేపేలా ఉండకూడదని పట్నాయక్ అభిప్రాయపడ్డారు.

మూడో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు రంగాలకు వ్యాక్సిన్ల కొనుగోలుకు అవకాశం ఇవ్వడంతో వ్యాక్సినేషన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చాలా రాష్ట్ర్రాలు ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లకు కూడా వెళ్లినప్పటికీ పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదని.. కేంద్రం అనుమతిలేకుండా అంతర్జాతీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు టీకాలను పంపిణీ చేసేందుకు మొగ్గు చూపడం లేదన్నారు. వ్యాక్సిన్‌ సరఫరాకు రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటున్నాయి. దేశీయ ఉత్పత్తి సంస్థలు అవసరానికి తగ్గ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రాలు గుర్తించాలని పట్నాయక్‌ తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల కేంద్రంతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

కాగా,ఇదే అంశంపై సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్రాలకు అవసరమైన టీకాలను కేంద్రమే సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలంటూ కలిసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరాన్ని విజయన్ తన లేఖలో ప్రస్తావించారు.