క్యాంపెయిన్ చేయవద్దు : సిద్దూపై ఈసీ 72గంటల బ్యాన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 03:34 AM IST
క్యాంపెయిన్ చేయవద్దు : సిద్దూపై ఈసీ 72గంటల బ్యాన్

కాంగ్రెస్ నాయకుడు,పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.బీహార్ ముస్లిం కమ్యూనిటీని ఉద్దేశించి సిద్దూ చేసిన వ్యాఖ్యలను ఈసీ  ఖండించింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను 72 గంటలపాటు సిద్దూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఈసీ బ్యాన్ విధించింది.72గంటలపాటు సిద్దూ…రోడ్ షోలు,ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి వీల్లేదు. మంగళవారం(ఏప్రిల్-23,2019)ఉదయం 10గంటల నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుంది.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న సిద్దూ…మాజీ కేంద్రమంత్రి తారిఖ్ అన్వార్ కి మద్దతుగా ఇటీవల బీహార్ లోని కతిహార్ లో ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్నారు.

ఆ సమయంలో ముస్లిం కమ్యూనిటీని ఉద్దూశించి సిద్దూ మాట్లాడుతూ…ముస్లిం సోదరులను హెచ్చరించడానికి ఇష్టపడతాను. ఓవైసీ వంటి నాయకులను తీసుకొచ్చి మిమ్మల్ని డివైడ్ చేస్తున్నారు.వాళ్లు విభజించి గెలవాలనుకుంటున్నారు. మీరందరూ కలిసి కట్టుగా ఉంటే… మీరు ఇక్కడ 65శాతం మంది ఉన్నారు. ఇక్కడ మైనార్టీ దే మెజార్టీ.అప్పుడు అంతా మారిపోతుంది.దీంతో మోడీ ఓడిపోతాడని  సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మతం ఆధారంగా సంఖ్యను లెక్కకట్టి మొత్తం ఓట్లు తమకు వేయాలని సిద్దూ కోరడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఓట్ల కోసం ముస్లిం కమ్యూనిటీని విభజించడాన్ని తప్పుబట్టింది. శనివారం(ఏప్రిల్-20,2019)సిద్దూకి ఈసీ నోటీసు  జారీ చేసింది. సిద్దూపై కేసు కూడా నమోదైంది.