Navjot Singh Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ!

పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ ​అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది.

Navjot Singh Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ గా సిద్ధూ!

Sidhu

Navjot Singh Sidhu పంజాబ్​ కాంగ్రెస్​లో నెలకొన్న సంక్షోభాన్ని తెరదించేందుకు ఆ పార్టీ ​అధిష్ఠానం తీవ్రంగా శ్రమిస్తోంది. సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌-న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య విభేదాలను పరిష్కరించి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఉమ్మడిగా ఎదుర్కోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ హైకమాండ్.. పంజాబ్ పీసీసీ చీఫ్‌గా సిద్ధూని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

2022 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సామాజిక వర్గాల పరంగా అందరినీ సంతృప్తిపరిచేలా పంజాబ్​లో కాంగ్రెస్​ నాయకత్వం ఉండాలని భావిస్తున్న పార్టీ అధిష్ఠానం..పీసీసీ చీఫ్​తో పాటు, ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని నిర్ణయించిందని..వీటిలో ఒక‌టి ద‌ళితుల‌కు ఇవ్వాల‌ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్ని స్థాయుల్లోనూ కాంగ్రెస్​ సంప్రదింపులు జరిపిందని.. పార్టీ నియామకాల్లో అసమ్మతి నెలకొనేందుకు అవకాశం లేదు అని ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేత ఒకరు తెలిపారు. కాగా,పంజాబ్ కాంగ్రెస్ లో కుమ్ములాటల వేళ ఇటీవల అటు సిద్ధూ,ఇటు సీఎం అమరీందర్ సింగ్ ఇద్దరూ గాంధీ ఫ్యామిలీతో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని గత వారం సోనియా గాంధీతో సమావేశం అనంతరం సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరోవైపు,సిద్ధూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్లు రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం సిద్ధూ చేసిన ఓ ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సిద్దూ తన ట్వీట్ లో.. మా ప్రతిపక్షం ఆప్​ పంజాబ్​పై నా దృక్కోణాన్ని, నేను చేసిన పనులను ఎల్లప్పుడూ గుర్తిస్తూనే ఉంటుంది. 2017కు ముందు నాటి బీద్​బీ, డ్రగ్స్​, రైతు సమస్యలైనా, ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభ​ సమస్యనైనా లేవనెత్తింది నేనేనని వారికి తెలుసు. పంజాబ్​ కోసం పోరాడేది ఎవరో కూడా వారికి స్పష్టంగా తెలుసు అని పేర్కొన్నారు. అయితే సిద్ధూని వదులుకునేందుకు సిద్ధంగా లేని కాంగ్రెన్ ఆయన డిమాండ్లు తీర్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ సునీల్ కుమార్ జక్కర్ ని తొలగించి ఆయన స్థానంలో సిద్ధూని నియమించాలని సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.