తివారీ కొడుకుని చంపేసి ఉండవచ్చు – ఢిల్లీ పోలీసులు

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 12:39 PM IST
తివారీ కొడుకుని చంపేసి ఉండవచ్చు – ఢిల్లీ పోలీసులు

UP రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్‌ మృతి కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. ఆయనది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీనితో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. దిండుతో అదిమి చంపేసి ఉంటారని..పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
 
ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోహిత్ గుండెపోటుతో ఓ ఆస్పత్రిలో చనిపోయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు. సౌత్ ఢిల్లోలోని డిఫెన్స్ కాలనీలో రోహిత్ నివాసం ఉంటున్నాడు.

ఆయన చనిపోయిన అనంతరం క్రైం బ్రాంచ్ పోలీసులు రోహిత్ ఉంటున్న ఇంటికి చేరుకుని పరిశీలించారు. ఆయన కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేస్తున్న వారిని విచారించారు. అతని భార్య అపూర్వ ఢిల్లీలో లేదు. ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుని ఆధారాల కోసం శ్రమించింది. రోహిత్ ఇంటి వద్ద 7 సీసీ కెమెరాలున్నాయి. అందులో 2 పని చేయడం లేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు ఉండడంతో రోహిత్ ఏప్రిల్ 12వ తేదీన వెళ్లి ఓటు వేశాడని.. ఏప్రిల్ 15న ఇంటికి తిరిగి వచ్చినట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే..ఇంటి గోడ సహాయంతో ఆయన లోపలికి వచ్చినట్లు సీసీ కెమెరాలో గుర్తించడం జరిగిందన్నారు. తనకు ముక్కులో నుండి రక్తం కారుతుందని పేర్కొన్న రోహిత్ ఢిల్లీలోని సాకేత్ మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చాడు. ఆ సమయంలో రోహిత్ ఎవరెవరికి ఫోన్ చేశారనే దానిపై దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. అనంతరం ఏప్రిల్ 17వ తేదీన రోహిత్ చనిపోయాడు. 

ఎన్డీ తివారి తన తండ్రే అంటూ చాలాకాలం పాటు ఆయన పోరాటం చేశారు. ఆరేళ్ల పాటు తివారీపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగించారు. రక్తనమూనాలు, డీఎన్ఏ పరీక్షలకు తివారీ అప్పట్లో సహకరించలేదు. చివరకు రోహిత్ శేఖర్ తన కొడుకే అని తివారీ అంగీకరించాల్సి వచ్చింది. రోహిత్ శేఖర్ బయోలాజకల్ ఫాదర్ తివారీ అని డిఎన్ఎ పరీక్షల్లో తేలింది. ఇతను ఎలా మృతి చెందాడో పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానుంది.