వయనాడ్ లో బీజేపీ వ్యూహం : రాహుల్ పై జనసేన చీఫ్ పోటీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2019 / 10:47 AM IST
వయనాడ్ లో బీజేపీ వ్యూహం : రాహుల్ పై జనసేన చీఫ్ పోటీ

దక్షిణాదిన తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దక్షిణాదిన అధిక స్థానాలు గెల్చుకోవాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.ఈ వ్యూహంలో భాగంగానే బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో ఆ పార్టీని అధికారానికి దూరం చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు మరో వ్యూహంతో ముందుకెళ్తోంది. కమ్యూనిస్టుల కంచుకోటగా పేరు ఉన్న కేరళను కాంగ్రెస్ టార్గెట్ చేసింది. స్వయంగా కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే ఎలాగైనా రాహుల్ ని ఓడించాలని బీజేపీ కంకణం కట్టుకుంది.ఇందులో భాగంగా కేరళలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న భారత్ ధర్మ జనసేన(BDJS) చీఫ్ తుషార్ వెల్లపల్లయ్ ని రాహుల్ పై పోటీకి దించింది.

వయానాడ్ లోక్ సభ స్థానానికి NDA అభ్యర్థిగా తుషార్ వెల్లపల్లయ్ ని సగర్వంగా ప్రకటిస్తున్నానని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం(ఏప్రిల్-1,2019) ట్వీట్ చేశారు. డైనమిక్ యూత్ లీడర్ తుషార్ సహకారంతో కేరళలో ఎన్డీయే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అమిత్ షా ధీమాగా చెబుతున్నారు. రాహుల్ కి తుషార్ గట్టి పోటీ ఇస్తాడని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీ నారాయణ ధర్మ పరిపాలనా యోగం జనరల్ సెక్రటరీ వెల్లపల్లి నటేశన్ కుమారుడే ఈ తుషార్. 2015లో నటేశన్ భారత్ ధర్మ జనసేనను పార్టీని స్థాపించారు. మూడో ఫేజ్ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా.. ఏప్రిల్ 23న వయనాడ్ లో పోలింగ్ జరుగనుంది. మే-23న ఫలితాలు వెలువడనున్నాయి. రాహుల్ – తుషార్ మధ్య పోటీతో వయనాడ్ దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.