వేతన జీవులపై కరోనా కాటు, ఒక్క నెలలో 50లక్షల ఉద్యోగాలు పోయాయి

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 12:02 PM IST
వేతన జీవులపై కరోనా కాటు, ఒక్క నెలలో 50లక్షల ఉద్యోగాలు పోయాయి

50-lakh-salaried-persons

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. భారతీయ ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) ఈ విషయాన్ని తెలిపింది. దీంతో ఏప్రిల్‌ నుంచి జూలై వరకు దేశవ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోయిన వారి మొత్తం సంఖ్య 1.89 కోట్లకు చేరుకుందని వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందని హెచ్చరించింది.



2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 1.89 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు:
సీఎంఐఈ డేటా ప్రకారం ఏప్రిల్‌లో 1.77 కోట్ల మంది, మేలో లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూన్‌లో 3.90 కోట్ల మంది ఉద్యోగాలు పొందగా.. జూలైలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలై వరకు చూసుకుంటే మొత్తంగా 1.89 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఉద్యోగుల పరిస్థితి చాలా దయనీయంగా మారిందని సీఎంఐఈ తెలిపింది. దేశంలో మొత్తం ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 21 శాతం మంది జీతాలు పొందే రంగంలో ఉన్నారని సీఎంఐఈ తెలిపింది. అటువంటి వారు ఉద్యోగాలు కోల్పోతే మళ్లీ ఉద్యోగం పొందడం చాలా కష్టమని వెల్లడించింది. ప్రతినెలా జీతాలు తీసుకునే ఉద్యోగులు భారీగా ఉద్యోగాలు కోల్పోతుండటం ఆందోళనకర పరిణామంగా సీఎంఐఈ చెప్పింది. జూన్ నెలలో పరిస్థితి కాస్త బాగానే ఉన్నా… జులై నుంచి లాక్ డౌన్ కొనసాగుతుండటం వేతనజీవుల పాలిట శాపంలా మారుతోంది.



41 లక్షల యువ కార్మికుల ఉపాధిపైనా దెబ్బ:
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా 41 లక్షల యువ కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరిలో నిర్మాణ, వ్యవసాయ రంగాల్లోని కార్మికులే అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), ఏషియన్‌ డెవలప్ మెంట్‌ బ్యాంక్‌ (ఏడీపీ) ల ఉమ్మడి నివేదిక తెలిపింది. ఈ నివేదికను ఐఎల్‌వో-ఏడీబీ మంగళవారం(ఆగస్టు 18,2020) విడుదల చేశాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆసియా, పసిఫిక్‌ ప్రాంతాల్లో యువత ఉపాధి అవకాశాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయని తెలిపాయి. ముఖ్యంగా వయోజనుల (25, ఆపై వయసువారు) కన్నా యువత (15-24 ఏళ్ల వయసువారు) ఎక్కువగా ప్రభావితం అవుతారని హెచ్చరించాయి. ‘యువత, కొవిడ్‌-19పై ప్రపంచవ్యాప్త సర్వే’ అంచనాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు భారీ ఎత్తున చర్యలు తీసుకోవాలని సూచించాయి.