మరింత జాగ్రత్తగా ఉండండి…మన్ కీ బాత్ లో సీక్రెట్ చెప్పిన మోడీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 09:05 AM IST
మరింత జాగ్రత్తగా ఉండండి…మన్ కీ బాత్ లో సీక్రెట్ చెప్పిన మోడీ

ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోడీ తెలిపారు. ఎక్కువ భాగపు దేశ ఎకానమీ తెరుచుకున్న ఈ సమయంలో ప్రజలు ఇంకా చాలా జగ్రత్తగా ఉండటం ముఖ్యమని మోడీ సూచించారు. ఇప్పటినుంచి మనమందరం ఎక్కువ శ్రద్దతో అన్ని కోవిడ్-19 ప్రొటోకాల్స్ పాటించాల్సిన అవసరముందన్నారు. ఇవాళ(మే-31,2020) ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ 64 వ భాగంలో మాట్లాడారు. కరోనా వైరస్ వల్ల దేశం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఈ సందర్భంగా మోడీ వివరించారు. ఇంతకుముందు తాను మాట్లాడినప్పుడు ప్యాసింజర్,ఎయిర్ ట్రావెల్ మూసివేయబడి ఉందని,ఇప్పుడు అన్ని ఆంక్షలు ఎత్తివేయబడ్డాయని మోడీ తెలిపారు.ప్రజలంతా కలిసి కరోనాను తరిమికొట్టారని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కలిసి దేన్నయినా ఎదుర్కొవాలని ఆయన అన్నారు. 

 కరోనా కట్టడిలో ఇతర దేశాల కంటే భారత్ ముందుందని ప్రధాని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు తక్కువన్నారు. కరోనాపై మన పోరాటం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది’ అని మోడీ అన్నారు. తాను ఇవాళ ఓ సీక్రెట్ తెలియజేయాలనుకుంటున్నానని చెప్పిన మోడీ…మోగా,ఆయుర్వేదంపై చాలామంది అంతర్జాతీయ నాయకులు ఆశక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ప్రతిచోటా ప్రజలు యోగా,ఆయుర్వేదం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నారని మోడీ చెప్పారు. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయని,ఇవి బలమైన శ్వాసకోశ వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగపడాతాయని,అందువల్ల కరోనా వంటి సమయాల్లో యోగా ముఖ్యమని మోడీ తెలిపారు.  

ఆయుష్ మంత్రిత్వశాఖ..ప్రజలు యోగాపై 3నిమిషాల వీడియో పంపించే కాంపీటీషన్ ను ప్రారంభించిందని,ప్రతి ఒక్కరూ ఈ పోటీలో భాగస్వాములవ్వాలని తాను విజ్ణప్తి చేస్తున్నానని మోడీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలకు వరంగా మారిందన్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా 1కోటి మందికి పైగా లబ్దిదారులు ఫ్రీ ట్రీట్మెంట్ పొందుతున్నట్లు చెప్పారు. పేదల డబ్బును ఆయుష్మాన్ భారత్ యోజన ఆదా చేస్తుందన్నారు. ఆంఫన్ తుఫాన్ ని బెంగాల్ ఒడిషా ప్రభుత్వాలు ధైర్యంగా ఎదుర్కొన్నాయని మోడీ ప్రశంసించారు. ఎడారి మిడతల రాష్ట్రాల వ్యాప్తంగా వినాశనాన్ని సృష్టించగలవని,కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నామని,ఎడారి మిడతలపై మనం పోరాటం చేయగలమన్న విశ్వాసం తనకుందని మోడీ అన్నారు. జూన్-5న మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటామని మోడీ తెలిపారు.

దేశంలో చాలావరకు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి మొదలయ్యాయన్నారు. ప్రజలంతా మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా పోరాటంలో మన జీవన విధానమే మన బలమని తెలిపారు. ప్రజల మద్ధతుతో కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తోందని… క్లిష్టసమయంలో పోలీసులు, వైద్యులు, మీడియా మిత్రులు ప్రాణాలొడ్డి పనిచేశారన్నారు. స్వచ్ఛంద సంస్థలు అన్నార్థులకు అండగా నిలిచాయన్నారు. 

తమిళనాడులోని మదురైలో సెలూన్ నడిపే మోహన్ తన కూతురి కోసం కష్టపడి పొదుపు చేసిన 5 లక్షల రూపాయలను, ఇబ్బందుల్లో ఉన్న పేదల కోసం ఖర్చు చేస్తున్నారని మోడీ తెలిపారు. అలాగే అగర్తలలో తోపుడుబండి ఆధారంగా జీవించే గౌతమ్ దాస్ తన రోజువారీ సంపాదనలో కొంత డబ్బుతో ప్రతి రోజూ పప్పు, అన్నం కొని పేదల కడుపు నింపుతున్నారు. పంజాబ్ పఠాన్ కోట్‌లోని దివ్యాంగుడు భైరాజు మిగతా వారి సాయంతో చిన్న మొత్తం సేకరించి 3 వేలకు పైగా మాస్కులను పేదలకు పంచారు. ఎన్నో కుటుంబాలకు నిత్యావసరాలు పంచారు. దేశవ్యాప్తంగా మహిళా స్వయం సేవక బృందాలు, పల్లెల్లో,పట్టణాల్లో ఎన్నో సామాజిక సంస్థలు మాస్కులు తయారు చేసి పంచుతున్నాయి. నమో యాప్ ద్వారా వారందరూ తాము చేస్తున్న సాయం గురించి నాకు చెబుతున్నారు. సమయాభావం వల్ల వారందరినీ నేను పేరుపేరునా ప్రస్తావించలేకపోతున్నా. వారందరినీ నేను గౌరవిస్తున్నా అని మోడీ తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారని… భవిష్యత్తులో మనం మరింత జాగ్రత్తగా ఉండాలపి… వైరస్‌ను ఎదర్కొనేందుకు ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నారు. కరోనా వల్ల వలసకూలీలు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. శ్రామిక్ రైళ్ల ద్వారా వలసకూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారన్నారు. వలసకూలీల కోసం వారి గ్రామాలలో కూడా క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యావత్ దేశం వలస కూలీలకు అండగా నిలిచిందన్నారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా ముందుడుగు వేశామన్నారు.