Mamata Banerjee : సోనియాతో మమత భేటీ..విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు

బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.

Mamata Banerjee : సోనియాతో మమత భేటీ..విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు

Mamata Sonia

Mamata Banerjee బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై సోనియాతో మమత చర్చించారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే కలిసికట్టుగా ఉండాలని విపక్షాలు ఆలోచిస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ..సోనియాతో సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోనియాతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మమత.. సోనియా గాంధీతో మీటింగ్ చాలా బాగా జరిగింది. కోవిడ్,పెగాసస్ అంశాలపై తాము చర్చించినట్లు మమత తెలిపారు. విపక్షాల ఐక్యతపై ఈ సందర్భంగా స్పందించిన మమత..బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ కలిసిరావాలన్నారు. తానొక్కదాన్నే అన్నీ చేయలేనని..అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇక,బీజేపీని ధీటుగా ఎదుర్కొనడానికి విపక్ష కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా అన్న ప్రశ్నకు..తాను రాజకీయ జ్యోతిష్కురాలని కాదన్నారు. అది పరిస్థితులపై,నిర్మాణంపై ఆధారపడి ఉంటుందని మమత జవాబిచ్చారు.

మరొకరెవరైనా విపక్ష కూటమికి నాయకత్వం వహిస్తే తనకు ఎలాంటి సమస్య లేదని మమత తెలిపారు. పిల్ల గంటల మోగించడానికి విపక్ష పార్టీలన్నింటికీ తాను సాయం చేస్తానన్నారు. తాను లీడర్ అవ్వాలనుకోవడం లేదు కానీ సామాన్య కేడర్ గా ఉండాలనుకుంటున్నట్లు మమత ఈ సందర్భంగా తెలిపారు. ఇక,పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై స్పందించిన మమత..ఎమర్జెనీ కన్నా చాలా తీవ్రమైన పరిస్థితి ఇప్పుడు దేశంలో ఉందని అన్నారు. కేంద్రం పెగాసస్ విషయంలో మౌనంగా ఉంటోందని మమత విమర్శించారు.

కాగా,ఐదు రోజుల ఢిల్లీ పర్యటన కోసం సోమవారం హస్తినకు చేరుకున్న మమత..మంగళవారం ప్రధాని మోదీతో,కాంగ్రెస్ నేతలు కమల్ నాథ్ ఆనంద్ శర్మతో భేటీ అయిన విషయం తెలిసిందే. మరికొందరు ముఖ్య విపక్ష నేతలను కూడా మమత కలుస్తున్నారు.