కాంగ్రెస్ ని సక్రమ పంథాలో పెట్టాల్సిన అవసరముంది..ఎన్నికల ఫలితాలపై సోనియా

ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ‌, అసోం,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పేల‌వమైన ఫ‌లితాలు సాధించ‌డం ప‌ట్ల పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ ని సక్రమ పంథాలో పెట్టాల్సిన అవసరముంది..ఎన్నికల ఫలితాలపై సోనియా

Cwc

CWC ప‌శ్చిమ బెంగాల్, కేర‌ళ‌, అసోం,పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పేల‌వమైన ఫ‌లితాలు సాధించ‌డం ప‌ట్ల పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నిరుత్సాహ‌పూరిత‌మైన ఈ ఫ‌లితాల‌తో మన లోటుపాట్ల‌ను గుర్తెర‌గాల‌ని పార్టీ నేతలకు హితవు పలికారు. ఈ ఫలితాలు పార్టీ..సక్రమ పంథాలో కొనసాగాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాయని ఆమె చెప్పారు.

ఈరోజు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పార్టీ ఓటమిపై సోనియా చర్చించారు. వరుస ఓటములను పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించాలని సోనియాగాంధీ హెచ్చరించారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితేంటో ఆయా రాష్ట్రాల్లోని పార్టీ సీనియర్ నేతలు స్పష్టంగా చెప్పాలని సోనియా సూచించారు. ఆశించిన దాని కన్నా తక్కువ సీట్లు ఎందుకు వచ్చాయో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కేర‌ళ‌, అసోం రాష్ట్రాల్లో ప్ర‌స్తుత ప్ర‌భుత్వాల‌ను కాంగ్రెస్ ఎందుకు గ‌ద్దె దింప‌లేక‌పోయిందో స‌మీక్షించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్లో పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకుపోయిందో ఆత్మ ప‌రిశీలన సాగించాల‌ని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మనకు గుణపాఠం నేర్పాయని, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి.. సరైన అంచనాలతో ముందుకు వెళదామని సోనియా సూచించారు. పార్టీకి తగులుతున్న వరుస ఎదురుదెబ్బలపై విశ్లేషణ చేసేందుకు ఓ చిన్న కమిటీని వేస్తున్నట్టు చెప్పారు. ఓటములకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్నీ ఆ కమిటీ పార్టీకి తెలియజేస్తుందన్నారు.

దేశంలో కోవిడ్ పరిస్థితిని మోడీ ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోయిందని సోనియా గాంధీ ఆరోపించారు. శాస్త్ర‌వేత్త‌ల స‌ల‌హాల‌ను పెడ‌చెవిన పెట్ట‌డంతో భార‌త్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.మ‌హ‌మ్మారి వ్యాప్తికి కార‌కాలుగా మారేలా పెద్ద‌సంఖ్యంలో ప్ర‌జ‌లు గుమికూడే కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించింద‌ని ఆరోపించారు. ఆక్సిజన్, వ్యాక్సిన్, కోవిడ్ మందుల కొరతను కేంద్రం తీర్చలేకపోతోందన్నారు. ప్రభుత్వానికి ఓ పాలసీ అంటూ లేదని,కోవిడ్ పరిస్థితిపై తాము చేస్తున్న సూచనలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు.