ITDCకి పార్లమెంట్ క్యాంటీన్ బాధ్యతలు….ముగిసిన అర్థశతాబ్దపు ఆనవాయితీ

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2020 / 07:21 PM IST
ITDCకి పార్లమెంట్ క్యాంటీన్ బాధ్యతలు….ముగిసిన అర్థశతాబ్దపు ఆనవాయితీ

52-year run ends, Railways to exit Parliament canteens, kitchens గత 52 సంవత్సరాలుగా పార్లమెంటు సభ్యులకు ఆహారాన్ని అందిస్తోన్న ఇండియన్ రైల్వేస్…ఆ పని నుంచి తప్పుకుంటోంది. పార్లమెంట్ ప్రాంగణంలోని క్యాంటీన్లు,కిచెన్లు నుండి తప్పకునేందుకు రైల్వే శాఖ సిద్ధమవగా…ఇకపై ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) పార్లమెంటు సభ్యులకు భోజనం అందించనుంది.



కాగా, 1968 నుంచి పార్లమెంటు క్యాంటీన్ ద్వారా ఎంపీలకు ఆహారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఈ క్యాంటీన్ ద్వారా ప్రతి పార్లమెంట్ సెషన్ లో సుమారు 5,000 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. క్యాంటీన్ మెనూలో భోజనం, సాయంత్రం స్నాక్స్ కోసం మొత్తం 48 ఆహార పదార్థాలు ఉన్నాయి.



అయితే, నార్త్ రైల్వే జోన్‌కు బుధవారం లోక్‌సభ సెక్రటేరియట్ ఒక లేఖ రాసింది. పార్లమెంటు ప్రాంగణం నుంచి సంస్థ నవంబర్ 15 లోగా ఖాళీ చేయాలని అందులో తెలిపింది. పార్లమెంట్ హౌస్ ఎస్టేట్లోని క్యాటరింగ్ యూనిట్ల విధులను ఆ తర్వాత ఐటీడీసీ చేపట్టాలని లేఖలో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని నార్తర్న్ రైల్వేస్.. ITDCకి అప్పగించవచ్చని లోక్‌సభ సెక్రటేరియట్ లేఖలో పేర్కొంది.

అయితే, గతంలో 17వ లోక్‌సభ ఫుడ్ మేనేజ్‌మెంట్‌పై సంయుక్త కమిటీని నియమించింది. ఈ కమిటీ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో క్యాటరింగ్ ఏర్పాట్లకు సంబంధించిన విషయాలను పర్యవేక్షించాలని నిర్ణయించినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాదే క్యాంటీన్ నిర్వహణ కోసం కొత్త సంస్థను వెతికే ప్రక్రియ మొదలైంది.



రెండు నెలల క్రితం లోక్‌సభ స్పీకర్, పర్యాటక శాఖ మంత్రి.. ఐటీడీసీ అధికారులతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఆహార నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తమకు ఆదేశాలు అందినట్టు ఐటీడీసీ అధికారులు తెలిపారు. పార్లమెంటు క్యాంటీన్లో మెరుగైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, ఆహారంపై సబ్సిడీలకు ముగింపు పలకాలని లోక్ సభ అధికారులను ఆదేశించారు. సబ్సిడీలను ఆపడం వల్ల పార్లమెంటుకు సుమారు రూ .17 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.