దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు

దేశంలో మళ్లీ వంద దాటిన కరోనా మరణాలు, కొత్తగా 16వేల 839 కేసులు

new corona cases india: దేశంలో కరోనా ఉధృతి కంటిన్యూ అవుతోంది. ఒకవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతుండగా..మరోవైపు, కొత్త కేసులు 17వేలకు చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గురువారం(మార్చి 4,2021) 7లక్షల 61వేల 834 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..16వేల 838 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 11లక్షల 73వేల 761కి చేరుకుంది. మూడు రోజుల తర్వాత తాజాగా మరణాల సంఖ్య 100 దాటింది. గడిచిన 24 గంటల్లో 113 మంది వైరస్‌కి బలయ్యారు. ఇప్పటివరకు లక్షా 57వేల 548 మంది కొవిడ్ తో చనిపోయారు.

యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో 1,76,319 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.58 శాతానికి చేరింది. రికవరీ రేటు 97.01 శాతానికి తగ్గింది. నిన్న ఒక్కరోజే 13వేల 819 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1.08కోట్ల పైచిలుకు మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మార్చి 4 నాటికి 1,80,05,503 మంది టీకా వేయించుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 13లక్షల 88వేల 170 మంది టీకా తీసుకున్నారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,99,40,742 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

ఇండియా నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేయాలని జరుగుతున్న పోరాటం మరో మైలురాయిని అందుకుంది. ఒక్క రోజులోనే 10 లక్షల మందికి పైగా టీకాను వేయించుకున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. నిన్న(మార్చి 4,2021) రాత్రి 7 గంటల వరకూ 10.93 లక్షల మందికి వ్యాక్సిన్ ను అందించామని, జనవరి 16న వ్యాక్సినేషన్ ను ప్రారంభించిన తరువాత, ఒకరోజులో ఇంతమందికి టీకాను అందించడం ఇదే తొలిసారని తెలిపింది.

కరోనా టీకా కార్యక్రమం మార్చి 1న రెండో దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 60 ఏళ్లకు పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45-59 ఏళ్ల వయసు వారికి టీకాను అందిస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలో టీకా సాధారణ పౌరులకూ అందుబాటులోకి వస్తుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇండియాలో నమోదవుతున్న తాజా కేసుల్లో 85.51 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మొన్న 17వేల 407 కేసులు నమోదు కాగా, అందులో 15 వేల వరకూ కేసులు ఈ రాష్ట్రాల్లోనే వచ్చాయి. అక్టోబర్ 18న 10,259 కేసులను నమోదు చేసిన మహారాష్ట్ర, ఆపై అత్యధికంగా బుధవారం నాడు 9,855 కేసులను నమోదు చేయడం గమనార్హం. ఆపై కేరళలో 2,765, పంజాబ్ లో 772 కేసులు వచ్చాయి.