New Rules: నేటి నుంచి కొత్త రూల్స్.. నూతన ఆర్థిక సంవత్సరంలో ఆరు పెద్ద మార్పులు ఇవే..

కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం పన్ను నుంచి పొదుపు పథకాల వరకు నిబంధనల్లో మార్పులు చేసింది. నిబంధనల మార్పులతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.

New Rules: మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ నెల ప్రారంభమైంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభం కావడంతో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. దేశంలో బంగారం విక్రయానికి సంబంధించి నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటితో పాటు టోల్, మ్యూచువల్ ఫండ్స్‌లో మార్పులు ఇలా పలు విభాగాల్లో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. పన్నుల భారం నుంచి పొదుపు పథకం వరకు నిబంధనలు మారాయి. ఫలితంగా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరగనుంది.

బంగారు ఆభరణాలపై హాల్ మార్కింగ్ తప్పనిసరి..

ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో ఈరోజు నుంచి బంగారానికి సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోబుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి ఆభరణాలపై ఆరు అంకెల అల్ఫాన్యూమరిక్ HUID కోడ్ తప్పనిసరి కానుంది. దీంతో నేటి నుంచి ఆరు అంకెల అల్ఫాన్యూమరిక్ హాల్ మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. నాలుగు అంకెల హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆభరణాలు ఇకపై విక్రయించబడవు.

కొత్త పన్నువిధానం..

ప్రతీయేటా ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2023 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం కొత్త స్లాబ్‌లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో స్లాబ్‌ల సంఖ్యను ఆరు నుంచి ఐదుకు తగ్గించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కొత్త పన్నువిధానం ఆప్షన్ మాత్రమే. ఎవరైనా పాత విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే దీనికోసం వారు ఫారమ్ ను పూరించాల్సి ఉంటుంది. ఏ పన్ను విధానం ఎంచుకోవాలనే నిర్ణయాన్ని ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే తీసుకోవాలి.

రూ. 7లక్షల వరకు పన్ను మినహాయింపు..

ఏప్రిల్ నెల ప్రారంభంకావడంతో నేటి నుంచి ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి రూ. 5లక్షల నుంచి 7లక్షలకు పెరిగింది. అయితే, ఈ విధానం పాత పన్ను ఎంచుకున్న వారికి వర్తించదు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొనే వారికే ఇది వర్తిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 87A కింద పన్ను మినహాయింపు రూ. 12,500 నుంచి రూ. 25వేలకు పెరిగింది. అయితే, కొత్త పాలనలో రూ. 7లక్షల వరకు ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రయోజనం పొందతున్న వారికి 80సీ కింద మినహాయింపు ప్రయోజనం ఉండదు.

టోల్ ఛార్జీలు పెంపు ..

జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచింది. ఏప్రిల్ నెల ప్రారంభం కావడంతో నేటి నుంచి అవి అమల్లోకి వస్తున్నాయి. ప్రతీయేటా నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను ప్రభుత్వం పెంచుతుంది. తాగాజా పెరిగిన ధరలతో.. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి – 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం రూ. 465 టోల్ చెల్లిస్తున్నారు. ఇక ఈరోజు నుంచి రూ. 490 చెల్లించాల్సి ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్స్ లో మార్పు..

నేటి నుంచి కొత్త సంవత్సరం ఆరంభం కావడంతో డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసే పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లభాలు కింద పన్ను విధించబడుతుంది. ప్రభఉత్వం దీర్ఘకాలిక మూలధన లాభాలను రద్దుచేసింది. ఎవరైనా 36 నెలల ముందు డెట్ మ్యూచువల్ ఫండ్‌ను రీడిమ్ చేసిన తర్వాత యూనిట్లను విక్రయిస్తే, లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా పన్ను విధించబడుతుంది. కానీ 36 నెలలకు పైగా హోల్డ్ చేసిన తర్వాత, యూనిట్లను విక్రయించడంపై దీర్ఘకాలిక మూలధన లాభాలు విధించబడతాయి.

చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్ల పెంపు..

చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మొత్తం 12 రకాల పొదుపు పథకాలకు గాను 10 పథకాలపై వడ్డీరేటును 0.1శాతం నుంచి 0.7శాతం వరకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు