బండి తీస్తే బాదుడే : అమ్మో.. సెప్టెంబర్ 1

  • Published By: chvmurthy ,Published On : August 31, 2019 / 12:43 PM IST
బండి తీస్తే బాదుడే :  అమ్మో.. సెప్టెంబర్ 1

ఆదాయపన్ను రిటర్న్ దాఖలు చేయటానికి  గడువు శనివారం ఆగస్టు 31తో ముగుస్తుంది. ఈ రోజు లోపు పైల్ చేయకపోతే  10 వేల రూపాయల వరకూ జరిమానా కట్టాల్సిరావోచ్చు.  కేంద్ర బడ్జెట్ లో ఆదాయ పన్నుపై  ప్రవేశపెట్టిన ప్రతిపాదనలు  సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటితోపాటు రేపట్నించి మోటారు వాహనాల సవరణ చట్టం, ఐఆర్‌సీటీసీ సర్వీస్‌ చార్జీలు అమల్లోకి వస్తున్నాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడనుంది. రేపటి నుంచి కొత్తగా అమల్లోకి వచ్చి సామాన్యులకు భారం కానున్న కొన్ని అంశాలు ఒకసారి చూద్దాం.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే బాదుడే 
సవరించిన మోటారు వాహనాల చట్టం సెప్టెంబర్ 1నుంచి అమల్లోకి వస్తోంది.  ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లఘించే వారు ఇకనుంచి భారీగా జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 25 వేల వరకు జరిమానా కట్టాల్సి రావొచ్చు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించి డబ్బులు ఆదా చేసుకోవాలని గత కొద్దిరోజులుగా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 

ఐఆర్‌సీటీసీ సర్వీసు చార్జి
ఐఆర్‌సీటీసీ లో టికెట్లు బుక్ చేసుకుంటే ఇక సర్వీసు చార్జి చెల్లించాలి. సెప్టెంబర్ 1నుంచి ఇ-టికెట్లపై సర్వీసు చార్జీలను ఐఆర్‌సీటీసీ పునరుద్ధరించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న నాన్‌ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 సర్వీసు ఛార్జీలను వసూలు చేయనున్నారు.

షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త
ఇప్పటివరకు 50 వేల రూపాయలకు పైబడి చేసిన షాపింగ్‌ గురించి మాత్రమే ఆదాయపన్ను శాఖకు బ్యాంకులు సమాచారం ఇచ్చేవి. ఇక నుంచి టాక్స్‌ రిటర్న్స్‌లో ఎటువంటి అనుమానం కలిగినా చిన్న ట్రాన్స్‌క్షన్‌ గురించి కూడా బ్యాంకులు వినియోగదారులను ఆరా తీసే అవకాశముంది.

బీమా సొమ్ముకు తప్పదు పన్ను 
జీవిత బీమా ప్రీమియం గడువు ముగిసిన తర్వాత తీసుకునే నికర సొమ్ముపైనా ఇకనుంచి  5 శాతం టీడీఎస్‌ కట్టాల్సి ఉంటుంది.

కోటి రూపాయలు విత్ డ్రా చేస్తే టీడీఎస్ కట్టాలి 
బ్యాంకుల నుంచి ఒక సంవత్సరంలో ఒక అకౌంట్‌ నుంచి కోటి రూపాయలు పైబడిన నగదు విత్‌డ్రాయెల్స్‌ జరిపితే 2 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది.  దీన్ని తప్పించుకోటానికి మీరు … ఒకటికి మించి ఎక్కువ ఉన్న మీ బ్యాంకు ఖాతాల్లోంచి విత్‌డ్రా చేస్తే అన్ని ఎకౌంట్ల లోంచి తీసిన మొత్తాన్ని లెక్కలోకి తీసుకుని రూ. 1 కోటి దాటితే 2 శాతం టీడీఎస్‌ విధిస్తారు. అంటే మీరు ఏ రకంగానూ ట్యాక్స్ ఎగ్గోట్టే అవకాశం లేదన్నమాట. 

ఇల్లు కొనుగోలుపై టీడీఎస్‌
ఇంటి కొనుగోలు విలువ రూ.50 లక్షలు, అంతకుమించి ఉంటే విక్రయదారుకు నిర్ణీత విలువ చెల్లించడానికి ముందుగానే, దానిపై 1 శాతం టీడీఎస్‌ను మినహాయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయంలోపు టీడీఎస్‌ను డిపాజిట్‌ చేయకపోతే, అప్పుడు 1–1.5 శాతం వడ్డీతో  పాటు పెనాల్టీ చార్జీలను కూడా చెల్లించాల్సి వస్తుంది. ఈ టీడీఎస్‌ను ఇంటి విక్రయ ధరపై కాకుండా, ఆర్జించిన మూలధన లాభాలపైనే అమలు చేయాల్సి ఉంటుంది.  

కొత్త పాన్‌కార్డులు
ఇప్పటి వరకు మీ ఆధార్‌ నంబరుతో పాన్‌కార్డులు లింక్‌ చేయనివారికి ఆదాయపన్ను శాఖ కొత్త పాన్‌కార్డులు జారీ చేస్తుంది.