New Modi Cabinet’s Big Decision : రైతుల కోసం రూ. లక్ష కోట్లు..రూ.23,123 కోట్ల కోవిడ్ ఫండ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం

పునర్​వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

New Modi Cabinet’s Big Decision : రైతుల కోసం రూ. లక్ష కోట్లు..రూ.23,123 కోట్ల కోవిడ్ ఫండ్ కి కేంద్ర కేబినెట్ ఆమోదం

Modi

New Modi Cabinet’s Big Decision పునర్​వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీఎంసీల ద్వారా రైతుల కోసం రూ.లక్ష కోట్ల కేటాయింపుకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాతో మాట్లాడుతూ..ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద రైతుల మౌలిక సదుపాయాల ఫండ్ కు రూ. లక్ష కోట్లు కేటాయించాం. ఈ నిధులను ఏపీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. ఈ చర్య..మండీలను కూడా మరింత బలోపేతం చేస్తుంది. అదేవిధంగా, కొబ్బరి పెంపకాన్ని అధికం చేసేందుకు కోకోనట్ బోర్డ్ యాక్ట్​ను సవరిస్తున్నాం. రైతు సంఘాల నుంచే కోకోనట్ బోర్డు అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని తోమర్ తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలు అమలు వల్ల మండీలు(APMCs)పై ఎటువంటి ప్రభావం ఉండదని..మండీలు బలహీనంగా మారబోవని వ్యవసాయ మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఇంకా,మండీలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.ఢిల్లీ సరిహద్దులో బైఠాయించిన రైతులు తమ ఆందోళనలను విరమించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చర్చలకు సిద్దంగా ఉందన్నారు.

మరోవైపు,అత్యవసర వైద్య మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.23,123 కోట్ల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాడవీయ తెలిపారు. ఈ అత్యవసర నిధిని కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా వినియోగించుకుంటాయన్నారు. దీని కింద మొత్తం 736 జిల్లాల్లో పిల్లల చికిత్స కేంద్రాలు, 20,000 ఐసీయూ బెడ్స్ కొత్తగా అందుబాటులోకి వస్తాయన్నారు. మొత్తం 23,000 కోట్లలో సుమారు 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేస్తుందని, 8,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ప్రణాళికలు అమలు చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు, కరోనా నియంత్రణలో మోదీ సర్కారు కీలకంగా వ్యవహరించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్లిందని చెప్పారు. వైద్య మౌలిక సదుపాయాల కోసం రూ. 25 వేల కోట్లను అందించనున్నట్లు చెప్పారు.