New Omicron sub-variant : భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ గుర్తింపు.. దీపావళి తర్వాత కేసులు పెరగొచ్చు..!

భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది.

New Omicron sub-variant : భారత్‌లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ గుర్తింపు.. దీపావళి తర్వాత కేసులు పెరగొచ్చు..!

New Omicron sub-variant : భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేగింది. కొత్త వేరియంట్ ను గుర్తించడం ఆందోళనకు గురి చేస్తోంది. దీపావళి తర్వాత కరోనా కేసులు పెరగొచ్చన్న నిపుణుల అంచనా భయాందోళన కలిగిస్తోంది. కొవిడ్ లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్‌ వేరియంట్‌ లో మరో సబ్‌ వేరియంట్‌ భారతదేశంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. బీఎఫ్‌.7 గా పిలుస్తున్న ఈ వేరియంట్‌ చైనాలోని మంగోలియా ప్రాంతంలో మొదలైందని.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఇది మన రోగ నిరోధక శక్తిని, వ్యాక్సిన్ల వల్ల వచ్చిన ఇమ్యూనిటీని కూడా తప్పించుకుని వ్యాపిస్తోందని నిపుణులు తెలిపారు. దీనివల్ల వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉన్నాయని.. కానీ వృద్ధులు, పిల్లలు, ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నవారికి ప్రమాదకరంగా మారొచ్చని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల గుజరాత్‌ లో ఒమిక్రాన్‌ బీఏ.5.1.7 వేరియంట్‌ తోపాటు అత్యంత విస్తరణ సామర్థ్యం కలిగిన బీఎఫ్‌.7 వేరియంట్‌ ను గుర్తించినట్టు గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 11న గుర్తించిన ఈ వైరస్‌ అతి తక్కువ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నట్టుగా తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్లను ‘ఒమిక్రాన్‌ స్పాన్‌’ అని పిలుస్తున్నారని తెలిపారు.

చైనాలో బాగా విస్తరించిన ఈ కొత్త వేరియంట్లు.. అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా ప్రభావం చూపుతున్నాయని వివరించారు. అయితే వీటి ప్రభావంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దీపావళి తర్వాత దేశంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కరోనా సోకి తగ్గడం, వ్యాక్సిన్ల ద్వారా ఇప్పటికే శరీరానికి సమకూరిన ఇమ్యూనిటీని ఈ కొత్త వేరియంట్‌ సులువుగా తప్పించుకుని వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీనికితోడు దేశంలో చలికాలం మొదలవుతున్న నేపథ్యంలో.. జాగ్రత్తగా ఉండటం అవసరమని స్పష్టం చేస్తున్నారు.

చలికాలంలో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి మరింత ఇబ్బంది పెరుగుతుందని.. న్యూమోనియా, ఆస్తమా వంటివి ఉన్నవారు కరోనా బారినపడితే ఇబ్బంది మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు, ఇతర జాగ్రత్తలను పాటించడం అవసరమని తేల్చి చెబుతున్నారు.

మరోవైపు దేశంలో కొవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో మరో 10 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 5,28,905కి చేరింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయంది.