మన్‌సుఖ్‌ మృతి కేసులో ట్విస్ట్‌..సచిన్ వాజే సమక్షంలో మిథి నదిలో NIA సోదాలు..కీలక ఆధారాలు లభ్యం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.

మన్‌సుఖ్‌ మృతి కేసులో ట్విస్ట్‌..సచిన్ వాజే సమక్షంలో మిథి నదిలో NIA సోదాలు..కీలక ఆధారాలు లభ్యం

Nia

NIA రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మన్‌సుఖ్‌ హిరేన్‌ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించగా అతడి మృతదేహాన్ని బాంద్రా కుర్లా ప్రాంతంలోని మిథి నది నుంచి వెలికితీసిన విషయం తెలిసిందే. అయితే, మున్ సుఖ్ మరణానికి కారణమని అనుమానిస్తున్న ముంబై మాజీ అసిస్టెంట్ పోలీస్‌ కమిషనర్ సచిన్‌ వాజేను సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు ఆదివారం(మార్చి-28,2021) బాంద్రాలోని మిధి నది బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లారు

వాజేతో కలిసి ముంబై బాంద్రాలోని మిథి నది బ్రిడ్జి వద్దకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఆయన ఇచ్చిన ఆధారాలతో గజ ఈతగాళ్లను రంగంలోకి దిగింది. మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతదేహం లభించిన చోట నది లోపల గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. నదిలో పడి ఉన్న రెండు కంప్యూటర్‌ సీపీయూలు, హార్డ్‌ డిస్క్‌, ల్యాప్‌టాప్‌, ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న రెండు నెంబర్ ప్లేట్లు, ఇతర వస్తువులు వెలికితీశారు. కీలకమైన ఆధారాలు లభించడంతో ఈ కేసులోని అసలు మిస్టరీ వీడవచ్చని తెలుస్తున్నది

కాగా,ఫిబ్రవరి 25,2021న ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసం ‘ఆంటిలియా’ సమీపంలో గత ఒక స్కార్ఫియో కారు నిలిపి ఉండటం, అందులో 20 జెలిటెన్ స్టిక్‌లు, బెదరింపు లేఖ కనిపించడం సంచలనం సృష్టించింది. పేలుడు పదార్ధాలు ఉన్న కారు యజమాని మన్‌సుఖ్ హిరేన్. తన కారును దొంగిలించారంటూ ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేసిన హిరేన్ మార్చి-5,2021న థానేలోని క్రీక్‌లో విగతజీవుడై కనిపించాడు. అయితే, సంబంధిత కారుని… క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ (CIU)‌లో అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ‘సచిన్ వాజేకు తన భర్త గత నవంబర్‌లోఇచ్చినట్టు మృతుని భార్య పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో మార్చి 13న వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వాజే ఉద్యోగంపై సస్పెన్షన్ వేటు పడింది. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు మరియు మన్ సుఖ్ హిరేన్ మృతి రెండు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సచిన్‌ వాజే కస్టడీని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇటీవల ఏప్రిల్‌ 3 వరకు పొడిగించింది.