నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం

రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం

Nirav Modis Extradition To India Cleared By Uk Government

Nirav Modi రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) స్కాంలో కీలక సూత్రధారి అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని భారత్ కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించే ఆర్డర్ పై గురువారం యూకే హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేశారు. భారత్ లో బ్యాంకులను ముంచడంతోపాటు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలకు సంబంధించి నీరవ్ మోదీపై ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని, అతణ్ని తిరిగి భారత్ పంపాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు గత నెలలో ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా యూకే హోం శాఖ కార్యదర్శి అప్పగింత ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు. దీంతో నీరవ్ ను భారత్ తీసుకొచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లే.

అయితే, ఈ నీరవ్ మోడీని భారత్ కు తీసుకొచ్చేందుకు ఒక మెట్టు దగ్గరగా ఉన్నప్పటికీ, తన అప్పగింతపై 28 రోజుల్లోగా యూకే హైకోర్టులో నీరవ్ చట్టబద్ధంగా సవాలు చేసే అవకాశం ఉంది. గతంలో లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో ఇలాగే జరిగింది. 2019 ఫిబ్రవరిలో మాల్యాను భారత్ కు అప్పగించే ఆర్డర్ పై అప్పటి హోంమంత్రి సంతకం చేయగా..అప్పుడు మాల్యా తన అప్పగింతను యూకే హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. కాబట్టి, విజయ్ మాల్యా కేసులో చూసినట్లుగా నీరవ్ అప్పగింత ఈ ప్రక్రియకు నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు.

నీరవ్ మోడీ 2018లో దేశం నుంచి పరారైన విషయం తెలిసిందే. ఆయన దేశం వదలి పారిపోయిన తర్వాతనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం వెలుగులోకి వచ్చింది. 2019లో నీరవ్ మోడీని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తాను నిర్దోషినని, భారత్ కు వెళితే న్యాయ విచారణ సజావుగా సాగదని, బ్రిటన్ లోనే విచారణ జరిపించాలని,భారత్ లోని జైళ్ల గురించి నీరవ్ మోడీ పలుమార్లు చేసిన వాదనలను లండన్ కోర్టు తోసిపుచ్చింది. భారత్ లో నిష్పక్షపాత విచారణ జరగదని అనడానికి ఆధారాలు లేవన్న కోర్టు అతడిని భారత్ కు అప్పగించాలని తీర్పు చెప్పడంతో ఇప్పుడు హోం శాఖ అంగీకార ఆదేశాలిచ్చింది. నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్న పీఎన్‌బీ కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, మనీలాండరింగ్ కేసులను ఈడీ పర్యవేక్షిస్తున్నది.