నాటకాలకు తెర : నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్

  • Published By: madhu ,Published On : March 5, 2020 / 01:15 AM IST
నాటకాలకు తెర : నిర్భయ దోషుల ఉరికి లైన్ క్లియర్

నిర్భయ దోషుల నాటకాలకు ఇక తెరపడింది. దోషుల్లో ఒకడైన పవన్‌గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో దోషులకు ఉరి తీయడానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఉరి శిక్షను ఎప్పుడు అమలు చేయాలన్నది ఇక పటియాల కోర్టు 2020, మార్చి 05వ తేదీ గురువారం తేల్చనుంది. నిర్భయ అత్యాచారం హత్య కేసులో దోషులు మూడుసార్లు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు.

ఈ నేపథ్యంలో నిర్భయ దోషి పవన్‌ గుప్తా క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంతో నలుగురు దోషులకు ఉరి తీసేందుకు మార్గం సుగమమైంది. దోషి పవన్‌ మెర్సీ పిటిషన్‌ రిజెక్ట్‌ కావడంతో ఢిల్లీ ప్రభుత్వం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించింది. నిర్భయ దోషులకు కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. నిర్భయ పేరెంట్స్‌ కూడా దోషులకు కొత్త డెత్‌ వారెంట్‌ జారీ చేసేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు పటియాల కోర్టు విచారణ జరపనుంది. నలుగురు దోషులకు ట్రయల్‌ కోర్టు నోటీసు జారీ చేసింది. దోషులకు ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అన్నారు నిర్భయ తల్లి తరపు లాయర్.

నిర్భయ దోషి పవన్‌ క్షమాభిక్ష అభ్యర్థన..  కేంద్ర హోంశాఖకు సోమవారం చేరింది. అనంతరం మెర్సీ పిటిషన్‌ పరిశీలన కోసం రాష్ట్రపతి వద్దకు పంపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ మెర్సీ పిటిషన్‌ను కొట్టివేశారు. ఇంతకు ముందు ముగ్గురు నిర్భయ దోషుల క్షమాభిక్ష పిటిషన్లను రాష్ట్రపతి తిరస్కరించారు. నలుగురికీ క్షమాభిక్ష తిరస్కరించడంతో ఇక ఉరి తీయడమే మిగిలింది. 

వాస్తవానికి మార్చి 3నే నలుగురినీ ఉరి తీయాల్సి ఉంది. కానీ అప్పటికి  పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండడంతో పటియాల కోర్టు మార్చి2న డెత్‌వారెంట్‌ నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పవన్‌ మెర్సీ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో పటియాల హౌస్‌ కోర్టు కొత్త డెత్‌వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉంది. జైలు నిబంధనల ప్రకారం మెర్సి పిటిషన్‌ తిరస్కరణకు గురైన 14 రోజుల తర్వాత ఉరిశిక్ష అమలు చేస్తారు.

నిర్భయ ఘటన జరిగినపుడు తాను మైనర్‌ అంటూ దోషి పవన్‌ దాఖలు చేసిన క్యూరేటివ్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది.  నిర్భయ కేసులో నలుగురు దోషులు ముఖేశ్‌, వినయ్‌, అక్షయ్‌, పవన్‌లకు న్యాయపరమైన అవకాశాలు అన్నీ మూసుకుపోయాయి. ఇక కోర్టు జారీ చేసే డెత్‌ వారెంట్‌ చివరిదవుతుంది. ఇక నలుగురికీ  తప్పించుకునే అవకాశాలు కూడా ముగిసిపోయినట్లే. చేసిన పాపానికి ప్రాణాలు వదలాల్సిందే. 

Read More : కరోనా : వైరస్ సోకడానికి ఒక్క తుమ్ము చాలు