పాపం పండింది : నిర్భయ దోషుల ఎత్తులు..2013 – 2020 కొనసాగిన డ్రామాలు

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 01:00 AM IST
పాపం పండింది : నిర్భయ దోషుల ఎత్తులు..2013 – 2020 కొనసాగిన డ్రామాలు

ఒకడేమో ఘటన జరిగిన నాటికి తాను మైనర్ నన్నాడు.. మరొకడేమో ఆరోజు అసలు తాను అక్కడ లేనేలేనన్నాడు. ఇంకొకడేమో భార్యతో విడాకుల పిటిషన్ వేయించాడు. మరొకడు జైలులో ఆత్మహత్యకు యత్నించాడు. ఇలా కొత్తకొత్త నాటకాలతో అందరినీ విస్తుపోయేలా చేసిన దోషుల ఎత్తులు చిత్తయ్యాయి. చేసిన ఘోరానికి ఏడేళ్లు తర్వాత పాపం పండటంతో ప్రాణాలు వదిలారు.

2014 మార్చి 15 :-
2013 సెప్టెంబర్ నుంచి, 2020 మార్చి వరకూ నడిచిన ఈ కేసులో దోషులు ఎక్కని మెట్టులేదు. తట్టని తలుపులేదు. ఢిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని కోర్టులను ఆశ్రయించారు. క్షమాభిక్ష కోసం రాష్ట్రపతి భవన్‌ను ఆశ్రయించారు. కానీ ప్రతి దగ్గరా దోషులకు ఎదురుదెబ్బే తగిలింది. ఉరిశిక్షపై 2014 మార్చి 15న ఇద్దరు హంతకులైన ముఖేష్ సింగ్, పవన్ గుప్తాలు స్టే తెచ్చుకోవడంతో ఈ వాయిదాల డ్రామా ప్రారంభమైంది.

అమాయకులమంటూ అప్పీల్ : – 
ఆ తర్వాత 2014 జూన్‌ 2 కూడా ఉరిశిక్ష వాయిదా పడింది. అక్షయ్‌ ఠాకూర్, వినయ్‌శర్మలు తాము ఈకేసులో అమాయకులమంటూ అప్పీల్ చేసుకోవడంతో శిక్ష అమలు రెండోసారి వాయిదా పడింది. అలా విపరీతమైన జాప్యం  చోటుచేసుకుంటూ ఎట్టకేలకు సుప్రీంకోర్టు కూడా  2017 మే 5న నలుగురు దోషులనూ ఉరి తీయాలని తీర్చు ఇచ్చే వరకు కొనసాగింది. ఆ తర్వాత అసలు డ్రామాకు తెరలేచింది.

నాలుగోసారి శిక్ష వాయిదా :-
2017లో శిక్ష నిర్ధారిస్తే.. 2018లో కానీ పవన్ గుప్తా, ముఖేష్, వినయ్ శర్మలు రివ్యూ పిటీషన్ దాఖలు చేయలేదు. తాము చేసిన తప్పిదానికి మరణశిక్ష తగదని రివ్యూ పిటీషన్లు వేసుకున్నారు. అది కాస్తా జులై 9, 2018న తిరస్కరణకు గురైంది. అలా నిర్భయ దోషులు కేసులో మూడోసారి తప్పించుకున్నారు. ఆ తర్వాతైనా శిక్ష అమలవుతుందని అనుకుంటే..అప్పుడూ ఆలస్యమే చోటు చేసుకుంది. అలా కేసులో నాలుగోసారి శిక్ష వాయిదా పడింది.

2019లో అక్షయ్ రివ్యూ పిటీషన్ : – 
ఆ తర్వాత మరో ఏడాదిన్నరకి కానీ మిగిలిన అక్షయ్ కుమార్ రివ్యూ పిటీషన్ వేయలేదు. నవంబర్ 2019లో అక్షయ్ రివ్యూ పిటీషన్ వేసాడు. ఓ వైపు కోర్టులు శిక్షలు విధిస్తున్నా మరోవైపు ఈ నలుగురూ మాత్రం తమ వాయిదాల డ్రామాలను కొనసాగిస్తూ వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ చట్టంలోని లూప్ హోల్స్‌ని తమకు అనుకూలంగా వాడుకున్నారు.

ఆరోసారి తప్పించుకున్నారు : –
అయితే.. 2019 డిసెంబర్ వచ్చేసరికి నిర్భయ నేరస్థులలో చావు భయం పెరిగిపోవడంతో పాటు..తెలివితేటలూ దొంగనాటకాలూ ఎక్కువైపోయాయి. డిసెంబర్ 16 తర్వాత ఉరికి ఏర్పాట్లనే ప్రచారం సాగడంతో..దోషుల్లో టెన్షన్ పెరిగిపోయింది. సుప్రీంకోర్టు అమికస్ క్యూరీ ముందు వినయ్ శర్మ, ముఖేష్ సింగ్‌ క్యూరేటివ్ పిటీషన్లు దాఖలు చేసారు. ఈ కేసులో శిక్ష అమలు కాకుండా ఆరోసారి అలా క్యూరేటివ్ పిటీషన్ల అండతో తప్పించుకున్నారు. 

పటియాల కోర్టు డెత్ వారెంట్ : – 
జనవరి 7, 2020న పటియాలా కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉరిశిక్ష అమలు అవుతుందనుకునేలోపే.. ముఖేష్ సింగ్ మెర్సీ పిటీషన్ పెండింగ్ ఉందనే సాకు చూపించడంతో జనవరి 17న డెత్ వారెంట్‌ని పాటియాలా కోర్టు రద్దు చేసింది. ఈ మధ్యలోనే పవన్ గుప్తా … తాను మైనర్‌ని అనే వాదనని ఢిల్లీ హైకోర్టు పట్టించుకోలేదంటూ సుప్రీంకోర్టుకి వెళ్లాడు. అది ఫలించలేదు కానీ.. నిర్భయ దోషులలో అక్షయ్ కుమార్ రాష్ట్రపతికి మెర్సీ పిటీషన్ పెట్టుకున్నాడు. ఇది జనవరి 30 వరకూ సస్పెన్స్‌లో ఉన్నా జనవరి 31న పటియాలా కోర్టులో జైలు రూల్స్ ని సాకుగా చూపుతూ డెత్ వారెంట్ రద్దు అయింది. దీంతో మరోసారి నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకోగలిగారు.(ఉరి ఎవరికి వేస్తారు? ఎందుకు వేస్తారు? మనదేశంలో ఎవరికి వేశారు?)

సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం..నిర్భయ తల్లిదండ్రులు : – 
ఆ తర్వాత పటియాలా కోర్టు కొత్త డెత్ వారెంట్ ఎప్పుడనేది ప్రకటించకపోవడంతో నేరస్తులు మరోసారి ఉరిశిక్ష అమలు కాకుండా నాటకమాడారు. దీనిపై అటు కేంద్రం..ఇటు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా..పటియాలా కోర్టుకి వెళ్లాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం సూచించింది. నిర్భయ పేరెంట్స్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన పటియాల కోర్టు ఎట్టకేలకు కొత్త డెత్‌వారెంట్‌ జారీ చేసింది. మార్చి 3 న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులకు ఒకేసారి ఉరితీయాలని ఆదేశించింది. దానిని కూడా ఈ క్రిమినల్స్‌ అడ్డుకున్నారు.

ఉరికి ఒక రోజు ముందు : –
ఆ తర్వాత నాలుగోసారి డెత్‌ వారెంట్ జారీ అయింది. మార్చి 20న ఉరితీయాలని కోర్టు ఆదేశించింది. ఈసారి కూడా దానిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఉరికి ఒకరోజు ముందు పటియాల కోర్టు, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేసి చావు దెబ్బ తిన్నారు. అంతేకాదు… 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉరికి మూడు గంటల ముందు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా అంతిమ తీర్పు వారికి వ్యతిరేకంగా వచ్చింది. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడం, ఆపై సుప్రీంకోర్టు వెళ్లినా చావుదెబ్బ తగలడంతో ఎట్టకేలకు నలుగురూ ఉరి కంభానికి వేలాడారు. 

Read More : నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?