నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 12:45 AM IST
నిర్భయ డే : 2012 డిసెంబర్ 16..ఆ రోజు ఏం జరిగిందంటే ?

2012 డిసెంబర్ 16 భారత దేశ చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన రోజు. ఆశలే ఊపిరిగా సాగిన ఓ యువతి పట్ల ఆరుగురు మృగాళ్లు అత్యంత క్రూరంగా వ్యవహరించిన రోజు. కదులుతున్న బస్సులో నిర్భయ పట్ల కర్కషంగా ప్రవర్తించిన రోజు. ఇంతకీ అసలు ఆరోజు ఏం జరిగింది?

2012 డిసెంబర్ 16 :-
2012 డిసెంబర్ 16న నిర్భయ తన స్నేహితుడితో కలిసి ఢిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ సినిమాహాలులో సినిమా చూడ్డానికి వెళ్లింది. అదే సమయంలో దక్షిణ దిల్లీ ఆర్కే పురం ప్రాంతంలోని రాంసింగ్ తన సోదరుడు ముకేశ్ సింగ్‌తో కలిసి జల్సా చేయాలని ప్లాన్‌ వేసుకున్నాడు. అదే కాలనీలో ఉండే పవన్ గుప్తా, వినయ్ శర్మ కూడా ఆ సోదరులతో కలిశారు. మత్తు, ఉన్మాదం తలకెక్కిన ఈ నలుగురూ తర్వాత బస్ క్లీనర్‌గా పనిచేసే అక్షయ్ ఠాకూర్‌తోపాటు ఓ మైనర్ బాలుడిని కూడా తమతోపాటు తీసుకెళ్లారు.

ప్రైవేటు బస్సులో : – 
సినిమా చూశాక నిర్భయ, ఆమె స్నేహితుడు తిరిగి ఇల్లు చేరడానికి ఆటో కోసం చూశారు. చాలాసేపటి వరకూ ద్వారక వెళ్లడానికి ఒక్క వాహనం దొరకలేదు. ఆ తర్వాత  ఒక ఆటోలో మునీర్‌కా బస్ స్టాండ్ వరకూ చేరుకోగలిగారు. అక్కడ కూడా ద్వారక వెళ్లడానికి వాహనాలేవీ లేవు. ఏం చేద్దామా అనుకుంటున్న తరుణంలో వారి ముందు ఓ ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది. లోపల్నుంచి ద్వారకా- ద్వారకా అనే శబ్దం వినిపించడంతో ఇద్దరూ అందులో ఎక్కేశారు. రాత్రి 9.30 అవుతోంది. బస్సు మునీర్‌కా నుంచి మహిపాల్‌పూర్ దగ్గరకు చేరుకోగానే మైనర్ బాలుడు, అతడి స్నేహితులు వీరితో గొడవ మొదలెట్టారు. మాటామాటా పెరగడంతో ఆ గొడవ.. గంటపాటు కొనసాగింది. 

వంతుల వారీగా అత్యాచారం : – 
రాంసింగ్ అతడి సహచరులు ఒకవైపు నిర్భయ స్నేహితుడిని కొడుతుంటే, మరోవైపు నిర్భయను బస్ వెనక్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. నిందితులు అక్కడే ఆమెపై వంతులవారీగా అత్యాచారం చేశారు. ఎదురు తిరిగిన ఆమె పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. ఐరన్ రాడ్‌తో ఇష్టారీతిన దాడి చేశారు. ఆమె స్నేహితుడిని కూడా రక్తం వచ్చేలా కొట్టారు. ఒక గంటపాటు ఈ హింసాకాండ కొనసాగింది. అయితే నిర్భయ చనిపోయిందని భావించిన వారు ఆమెను రోడ్డు పక్కన విసిరేశారు.

సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలో : – 
ఇంటి దగ్గర సాయంత్రం కూతురి కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లి దండ్రులు రాత్రి పది గంటల నుంచీ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. రాత్రి 11.15కు నిర్భయ తండ్రికి ఒక ఫోన్ వచ్చింది. నిర్భయకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పగానే, కుటుంబం వెంటనే సఫ్దర్ గంజ్ ఆస్పత్రి చేరుకుంది. అక్కడ బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

సింగపూర్ ఆసుపత్రిలో : – 
మంచు దుప్పటి కప్పేసిన దిల్లీ ఆ తర్వాత రోజు ఉదయం… చరిత్రలోనే దారుణమైన ఈ ఘటన గురించి తెలుకుంది. ఆ తర్వాత రెండు వారాల వరకూ నిర్భయ మృత్యువుతో పోరాడింది. కానీ ఆమె శరీరమంతా తగిలిన గాయాలవడంతో కోలుకునే అవకాశాలు అంతకంతకూ క్షీణించాయి. ఆమె స్నేహితుడిని మాత్రం ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. నిర్భయ పరిస్థితి క్షీణించడం చూసిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 27న ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్ పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఒక్కరోజుకే…అంటే డిసెంబర్ 29న ఉదయం నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో మృతి చెందింది.

పోలీసుల అదుపులో నిందితులు : – 
ఈ కేసులో వారంలోపే రామ్‌సింగ్, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌తో పాటు మైనర్ బాలుడిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహదారిలో ఉన్న దుకాణాల సీసీటీవీల నుంచి లభించిన పుటేజ్ ద్వారా బాధితురాలిని తీసుకెళ్లిన ప్రైవేట్ బస్సును గుర్తించారు. ఫోరెన్సిక్ ఆధారాలు, బాధితుల వాంగ్మూలం ఆధారంగా ఒక బలమైన కేస్ సిద్ధం చేసిన పోలీసులు… అరెస్టు చేసిన వారం లోపే వారిపై కోర్టులో చార్జిషీటు ఫైల్ చేశారు. పోలీసుల దర్యాప్తుతోపాటూ చనిపోడానికి ముందు నిర్భయ స్పష్టంగా ఇచ్చిన వాంగ్మూలం, కోర్టు ఎదుట ఆమె స్నేహితుడు ఇచ్చిన బలమైన వాంగ్మూలం ఈ కేసును బాధితురాలి పక్షాన నిలపడంలో కీలక పాత్ర పోషించాయి.

ఆరుగురు దోషులు..ఒకరు ఆత్మహత్య : – 
ఈ కేసులోని ఆరుగురు దోషుల్లో ఒకడైన రాంసింగ్‌ మార్చి 2013లో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ అయిన మరో దోషి… 2013 ఆగస్టులో  చైల్డ్ ఇంప్రూవ్‌మెంట్ హోంకు వెళ్లి మూడేళ్ల శిక్ష తర్వాత 2015లో విడుదలయ్యాడు.  2013 సెప్టెంబర్‌లో దిల్లీలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు సామూహిక అత్యాచారం, హత్య, ఆధారాలు చెరిపివేసినందుకు మిగిలిన నలుగురు దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లను దోషులుగా ఖరారు చేసింది.

నలుగురికి ఉరి శిక్ష : – 
శిక్షను తగ్గించాలని వేసిన అన్ని పిటిషన్లను తోసిపుచ్చిన కింది కోర్టు ఆ నలుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే.. చట్టంలోని లొసుగులును ఉపయోగించుకొని.. ఉరి శిక్షను మూడుసార్లు వాయిదాపడేలా చేశారు. ఆఖరికి.. నలుగురికి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవకాశాలన్నీ పూర్తవడంతో 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం ఉరిశిక్ష అమలైంది. 
Read More : ఏడేళ్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ : నిర్భయకు న్యాయం జరిగింది