పవన్ గుప్తా కొత్త డ్రామా : హంతకులకేనా హక్కులు..నిర్భయ తల్లి కన్నీళ్లు

  • Published By: madhu ,Published On : February 12, 2020 / 06:54 PM IST
పవన్ గుప్తా కొత్త డ్రామా : హంతకులకేనా హక్కులు..నిర్భయ తల్లి కన్నీళ్లు

నిర్భయ కేసులో దోషులు మరోసారి తప్పించుకుకున్నారు. దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా తన లాయర్ని మార్చాలంటూ కోరడంతో పాటియాలా కోర్టు డెత్ వారెంట్‌పై విచారణ వాయిదా వేసింది. దీంతో నిర్భయ తల్లి మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు. హంతకులకేనా హక్కులు..మరి మా హక్కుల మాటేంటి..అంటూ కోర్టు హాలులో విలపించారు. దీంతో అసలు ఈ కేసులో ఉరిశిక్ష అమలవుతుందో లేదో అనేస్థాయిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

నిర్భయ కేసులో డెత్ వారెంట్ కోసం కోర్టుకెక్కిన పిటీషనర్లకు నిరాశే మిగిలింది. పిటీషన్‌పై విచారణను పాటియాలా కోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర నిస్పృహకి లోనయ్యారు. అసలు ఎప్పుడూ దోషుల హక్కుల గురించే కానీ..తమ హక్కుల మాటేంటి అంటూ విలపించారు. కోర్టు బయటా లాయర్‌తో కలిసి నిరసనకు దిగారు. నిర్భయ కేసులో దోషులు నలుగురికి ఉరి వేసేందుకు కొత్త డెత్ వారెంట్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్లగా…న్యాయస్థానం పాటియాలా కోర్టుకి వెళ్లమని నిర్భయ తల్లిదండ్రులకు సూచించింది. దీంతో పాటియాలా కోర్టుకి వెళ్లిన పిటీషనర్లకు వాయిదాల పర్వం వెక్కిరిస్తుండటంతో..ప్రభుత్వం, కోర్టులపై నిస్పృహ వ్యక్తం చేశారు.

దోషులలో ఒకరైన పవన్ గుప్తా మరో డ్రామాకి తెరలేపాడు.. తన తరపున కొత్త లాయర్ కావాలంటూ కోరాడు. దీంతో కోర్టు కొంతమంది లాయర్ల జాబితాని ఇచ్చి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంలోనే నిర్భయ తల్లిదండ్రులు రెండు చేతులూ జోడించి మరీ న్యాయస్థానానికి తమ ఆవేదన విన్పించారు. ఈ సందర్భంలోనే జడ్జి చట్ట ప్రకారం ప్రతి దోషికి న్యాయ సహాయం పొందే వీలుందని చెప్పినట్లు తెలిసింది. నిర్భయ కేసులో ఇలా వాయిదాల పర్వం  సాగుతుండటంతో. తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. గురువారంనాడైనా కొత్త డెత్ వారెంట్ ఇష్యూ అవుతుందనే అంచనాలు ఉన్నా అది అమలయ్యే పరిస్థితి మాత్రం అనుమానమేనంటున్నారు.