న్యాయం కోసం ఇంకెన్నాళ్లు తిరగాలి..10టీవీతో నిర్భయ తల్లి

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2020 / 01:49 PM IST
న్యాయం కోసం ఇంకెన్నాళ్లు తిరగాలి..10టీవీతో నిర్భయ తల్లి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఇవాళ(జనవరి-31,2020)పటియాలా కోర్టు తీర్పు ఇవ్వడంపై నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలోనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌.. ఆ నలుగురికి ఎన్నడూ ఉరిశిక్ష అమలు కానివ్వని తనను సవాలు చేశాడని తెలిపారు. 

పటియాలా కోర్టు వద్ద 10టీవీతో ఆమె మాట్లాడుతూ…న్యాయవ్యవస్థలోని లొసుగులను దోషులు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్ల నుంచి తాము న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని, న్యాయం కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని ఆశాదేవి మండిపడ్డారు. ట్రయల్ కోర్టు,సుప్రీంకోర్టు అంటూ తాము ఇంకా న్యాయం కోసం కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, తాను ఎంత పోరాటం చేసినా న్యాయవ్యవస్థలో మార్పులు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల క్షమాబిక్ష పిటిషన్లు త్వరగా తిరస్కరించాలని తాను రాష్ట్రపతిని కోరుతున్నానన్నారు. నలుగురు దోషులు ఉరిశిక్షపై విధించిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేయబోతున్నట్లు ఆమె తెలిపారు. దోషులను ఉరి తీసేంత వరకు పోరాటం ఆపబోనని ఆమె సృష్టం చేశారు. మరోవైపు సారీ ఇండియా,సారీ నిర్భయ హ్యాష్ టాగ్ లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిలు కూడా ఇవాళ పటియాలా తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ మధ్యాహ్నాం ఢిల్లీ పటియాలా కోర్టు స్టే విధించింది. వినయ్ కుమార్ శర్మ క్షమాబిక్ష పిటిషన్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది కనుక ఉరిశిక్షను వాయిదా వేయాలని ముగ్గురు నిందితులు పవన్ గుప్తా,వినయ్ కుమార్ శర్మ,అక్షయ్ కుమార్ ల తరపున వాదనలు వినిపిస్తున్న అడ్వకేట్ ఏపీ సింగ్ కోర్టును అభ్యర్థించారు. ఒకరి క్షమాబిక్ష పిటిషన్ మాత్రమే పెండింగ్ లో ఉందని, మిగతావాళ్లను ఉరితీయవచ్చని,ఈ కేసులో తమ ఉరిశిక్ష నిలుపుదల కోరుతూ ముగ్గురు నిందుతుల దాఖలు చేసిన పిటిషన్ ను సవాల్ చేస్తూ  తీహార్ జైలు అధికారులు కూడా పిటిషన్ దాఖలు చేశారు.

అయితే  కేసులో ఒక దోషి పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు మిగిలిన వారిని ఉరితీయకూడదని రూల్స్ నిర్దేశిస్తున్నాయని నిందితుల వన్ గుప్తా,వినయ్ కుమార్ శర్మ,అక్షయ్ కుమార్ ల తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ ఏపీ సింగ్ కోర్టును అభ్యర్థించారు. వాదనలు విన్న అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా…తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేశారు. అయితే అంతకుముందు తాను నేర సమయంలో మైనర్ అని పవన్ పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఫిబ్రవరి-1 ఉదయం 6గంటలకు నలుగురు నిందితులను ఉరితీయాలంటూ జనవరి17,2020న ట్రయల్ కోర్టు రెండోసారి బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు నిందితులను జనవరి-22,2020న ఉరితీయాలంటూ జనవరి-7,2020న కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే వినయ్,అక్షయ్ లు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పవన్ ఇంకా క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. దోషుల క్యూరేటివ్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేసిన తరువాత మాత్రమే అధ్యక్షుడి ముందుకు క్షమాబిక్షపిటిషన్ వచ్చే అవకాశముంటది.

దేశ రాజధానిలో డిసెంబర్ 16, 2012లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మొత్తం ఆరుగుర్ని దోషులుగా గుర్తించగా..వారిలో ఒకడు… తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి మైనర్ కావడంతో… జువెనైల్ చట్టాల ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిలీజ్ అయ్యాడు. మిగతా నలుగురూ నిందితులు దోషులైన పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.