ఓలా,ఊబర్లే ఆటో మొబైల్ రంగం మందగమనానికి కారణం

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2019 / 02:01 AM IST
ఓలా,ఊబర్లే ఆటో మొబైల్ రంగం మందగమనానికి కారణం

ఆటో మొబైల్ రంగం మందగమనంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు  సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అందులో కొన్ని ఆలోచింపజేసేవిగా, మరికొన్ని నవ్వు పుట్టించేవిగా ఉన్నాయి. వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ చూసే ఆర్థిక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? నేను కూడా ఇలాంటి న్యూస్ చూశాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. టీ పరిశ్రమ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. ఎందుకంటే ప్రజలు కాఫీనే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి అంటూ సెటైరికల్ గా మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

నిజమే డబ్బుని మిగిలించుకోవాలి కదా..డ్రైవింగ్ టెన్షన్స్, పేనాలిటీలు కూడా ఉండవు, పార్కింగ్ ఇబ్బందులు ఉండవు.. అందుకే వాహనాలు కొనుగోలు చేయటం లేదంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నిరుద్యోగులు ఉద్యోగం చేసేందుకు ఇష్టపడకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని ఓ నెటిజన్ సెటైర్ వేశాడు. డాలర్‌ను ప్రిఫర్ చేయడం వల్లే రూపాయి విలువ పడిపోతోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రోడ్లు బాగా లేవు అందుకే లారీల విక్రయాలు పడిపోయినవి… అంతే కదా మంత్రి గారు అంటూ మరో నెటిజన్ సెటైర్ వేశాడు.ఈ విధంగా సీతారామన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పంచ్ లు పేలుతున్నాయి.

మంగళవారం(సెప్టెంబర్-10,2019)నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ….ఈ రోజుల్లో యువత ఓలా, ఉబెర్ లాంటి క్యాబ్స్‌ ను ఆశ్రయిస్తున్నారని, సొంతకార్లు కొనుక్కొని EMI భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, మిలీనియల్స్(యువత) క్యాబ్స్‌లకే మొగ్గుచూపుతుండటం వల్లే ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని అన్నారు. బీఎస్6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతోపాటు యువత ఎక్కువగా క్యాబ్, మెట్రో రైళ్లపై ఆధారపడుతుండటం కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమనం ఏర్పడిందని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 

ద్విచక్ర వాహనాలు, కార్లు,లారీల విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సమయంలో ఆర్థిక మంత్రి  వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మారుతీ సుజుకీ,అశోక్ లేలాండ్ వంటి పలు మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తమ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోవడంతో తమ ఫ్లాంట్ లకు సెలవులు ఇచ్చేస్తున్నాయి. తమ ఫ్లాంట్ లకు తాత్కాలిక సెలవులు ఇచ్చి ప్రొడక్షన్ నిలిపివేస్తున్న విషయం తెలిసిందే.