నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 11:53 AM IST
నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్

మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల పేర్లతో నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నకిలీ లేఖలలో మాజీ సైనిక అధికారుల పేర్లను జోడించడం తప్పు అన్నారు. ప్రచారంలో సైనిక దళాల ప్రస్తావనపై అభ్యంతరం తెలుపుతూ లేఖలో తెలిపిన ఇద్దరు అధికారులు తాము సంతకాలు చేయలేదన్నారు. సైనిక అధికారుల లేఖ తమకు అందలేదని రాష్ట్రపతి భవన్ అధికారులు తెలిపారు. 

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు 156 మంది మాజీ సైనిక అధికారులు లేఖ రాశారు. సైనికులను నేతలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో వెల్లడించారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిరోధించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు 156 మంది మాజీ సైనికులు. దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించే సైనికులను ఓట్ల కోసం, రాజకీయాలకు వాడుకోవడం తమకు మనస్తాపాన్ని కలిగిస్తోందని లేఖ లో పేర్కొన్నారు మాజీ సైనికులు.