రాహుల్ “RBI లిస్ట్” ఎటాక్…13ట్వీట్ల కౌంటర్ ఇచ్చిన నిర్మలాసీతారమన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 06:08 AM IST
రాహుల్ “RBI లిస్ట్” ఎటాక్…13ట్వీట్ల కౌంటర్ ఇచ్చిన నిర్మలాసీతారమన్

దేశంలోని బ్యాంకులను నిండా ముంచిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన నేపథ్యంలో.. అలా రుణాలు ఎగగొట్టిన వారిలో బీజేపీ ఫ్రెండ్స్ ఉన్నారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ఆయన చేసిన ఆరోపణలు ప్రజలను తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయన్నారు. బ్యాంకు రుణాల మాఫీ అంటే కాంగ్రెస్ నాయకుడు,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను సంప్రదించి తెలుసుకోవాలని రాహుల్ కి సూచించారు.

కాంగ్రెస్ హయాంలో 2006-2018 మధ్య మొండి రుణాలను ఎక్కువగా ఇచ్చారని ఆమె వెల్లడించారు. అటు-నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ. విజయ్ మాల్యాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె మొత్తం 13 ట్వీట్లు చేశారు. నాటి యూపీఏ ‘ఫోన్ బ్యాంకింగ్ ‘ద్వారా లాభపడినవారే డీఫాల్టర్లుగా మారారని నిర్మలా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా ఉన్న రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. 2009-10, 2013-14 మధ్య షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 1,45,226 కోట్లను మాఫీ చేశాయని నిర్మలా తెలిపారు. నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనల్ సైకిల్ ప్రకారం నిరర్థక ఆస్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు ఎవరి రుణాన్నీ మాఫీ చేయలేదని,రుణాలు చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ కావాలనే ఎగగొట్టినవారిని‘విల్ ఫుల్ డీఫాల్టర్లు’గా ఆర్బీఐ ఆయా కేటగిరీల్లో చేర్చిందని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఉద్దేశపూర్వక ఎగవేతదారులను వెంటాడుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటివరకు 9,967 రికవరీ సూట్లు, 3,515 ఎఫ్ఐఆర్ లు, కేసులలో ఫ్యుజిటివ్ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మరియు విజయ్ మాల్యా కేసులలో అటాచ్మెంట్ మరియు సీజ్ చేసిన వాటి యొక్క మొత్తం విలువ రూ .18,332.7 కోట్లు అని ఆమె చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు లేదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి మరియు మిత్రవాదాన్ని ఆపడానికి కాంగ్రెస్ ఎటువంటి నిబద్ధత లేదా మొగ్గు చూపలేదని ఆమె తన ట్వీట్లను ముగించారు. 

సాకేత్ గోఖలే అనే కార్యకర్త దాఖలు చేసిన RTI దరఖాస్తుకు స్పందనగా… మంగళవారం ఆర్బీఐ 50జాబితాను విడుదల చేసిన తర్వాత బీజేపీపై కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. అధికార పార్టీ స్నేహితులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారన్న కారణంతోనే పార్లమెంట్ నుంచి ఈ లిస్ట్ ను బీజేపీ దాచిపెట్టిందని రాహుల్ విమర్శించారు. మంగళవారం(ఏప్రిల్-28,2020)కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ ట్వీట్ లో…నేను పార్లమెంట్ లో ఒక సాధారణ ప్రశ్న అడిగాను. 50 మంది అతిపెద్ద బ్యాంక్ స్కామర్ల పేర్లను చెప్పమని అడిగాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు ఆర్బీఐ… నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ మరియు ఇతర బీజేపీ స్నేహితుల పేర్లను లిస్ట్ లో పెట్టింది. ఇందుకే బీజేపీ..పార్లమెంటు ముందు నిజం దాచిపెట్టారంటూ తాను పార్లమెంట్ లో ప్రశ్నిస్తున్న వీడియోను రాహుల్ గాంధీ ట్విట్టర్ లో షేర్ చేశారు.

వేల కోట్ల రూపాయలను భారతీయల బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యాతో సహా 50 మంది ఎగవేతదారుల 68,607 కోట్ల రూపాయల రుణాలను మోడీ సర్కార్ “మాఫీ” చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. 2014 నుండి 2019 సెప్టెంబర్ వరకు రూ .6.66 లక్షల కోట్ల రుణాలను మోడీ ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.