వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ప్రకటించిన కేంద్రం
వాహనాల తుక్కుకు సంబంధించిన "వెహికల్ స్క్రాపింగ్ పాలసీ"ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు.

Nitin Gadkari వాహనాల తుక్కుకు సంబంధించిన “వెహికల్ స్క్రాపింగ్ పాలసీ”ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గురువారం(మార్చి-18,2021)పార్లమెంట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు, అన్‌ఫిట్‌గా ఉన్న వాహనాలను తీసివేసేందుకు స్క్రాపింగ్ పాలసీని తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. గెలుపు-గెలుపు విధానంతో కొత్త వాహన తుక్కు చట్టాన్ని అమలు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ స్క్రాపింగ్ పాలసీ ప్రకారం.. ఎవరైనా తమ వాహనాలకు తుక్కుకు ఇస్తే.. వారికి బలమైన ప్రోత్సహాకాలు ఇవ్వనున్నట్లు గడ్కరీ తెలిపారు. నౌకలను తుక్కు చేసే యార్డుల తరహాలోనే వాహనాల స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
కొత్త పాలసీ ప్రకారం..ఓనర్లు తమ వద్ద ఉన్న పాత వాహనాలను తుక్కు చేయవచ్చు,అలాగే ఆ విధానంతో కొత్త వాహనాలను ఖరీదు చేయవచ్చు. ఒకవేళ మీరు మీ పాత వాహనాన్ని తుక్కుకు ఇస్తే, అప్పుడు దానికి కొత్త వాహనం ఎక్స్-షోరూమ్ ధరపై 4 నుంచి 6 శాతం వరకు తుక్కు విలువ కట్టి డిస్కౌంట్ ఇవ్వనున్నారు. స్క్రాప్ సర్టిఫికేట్‌తో కొత్త వాహనాన్ని కొన్న వారికి 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. స్క్రాపింగ్ సర్టిఫికేట్‌తో కొత్త వాహనాన్ని కొన్న వారికి రిజిస్ట్రేషన్ ఫీజుల్లో మినహాయింపు, రోడ్డు ట్యాక్స్‌లో కూడా రిబేట్ ఇవ్వనున్నట్లు గడ్కరీ వెల్లడించారు. పర్సనల్ వాహనాలకు రోడ్డు ట్యాక్స్‌లో 25 శాతం రిబేట్, అలాగే కమర్షియల్ వాహనాలకు 15 శాతం మినహాయింపు కల్పించనున్నారు.
స్క్రాపింగ్ విధానంతో వాహనాలకు చెందిన కాంపోనెంట్ల ధర 40 శాతం తగ్గనున్నట్లు గడ్కరీ తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎంపీలందరూ బయోఫ్యూయల్, ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల ఇంధన సామర్థ్యం చాలా ఎక్కువ అని, దీని వల్ల సాధారణ పౌరులు లబ్ధి పొందుతారని, పెట్రోల్-డీజిల్ దిగుమతి తగ్గుతుందని, ఇది మరో రకంగా ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. కొత్త ఉత్పత్తులు, కొత్త మైలేజీ, కొత్త బ్రేకింగ్ సిస్టమ్స్‌తో ఆదా అవుతున్నదని, కోవిడ్ కన్నా ప్రమాదాల వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని మంత్రి గడ్కరీ తెలిపారు. మరో 30 రోజుల్లో కొత్త వెహికిల్ స్క్రాప్ పాలసీ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్లు మంత్రి చెప్పారు. ఒకవేళ ఏదైనా వాహనం ఫిట్‌నెస్ పరీక్షలో విఫలం అయితే, ఆ వాహనానికి ఎండ్ ఆఫ్ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. 20 ఏళ్ల తర్వాత అన్‌ఫిట్ తేలితే.. ఆ వాహనాన్ని డీ-రిజిస్టర్ చేయనున్నారు.
మరో ఏడాది లోగా దేశంలోని మొత్తం టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామని గడ్కరీ ప్రకటించారు. జీపీఎస్ ఆధారిత టోల్ సేకరణ చేపడతామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయన్నారు. మిగిలిన 7 శాతం వాహనాలకు రెట్టింపు టోల్ వేసినా కూడా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేదని చెప్పారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై పోలీసు విచారణకు ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. ఫిబ్రవరి 16 నుండి ఫాస్టాగ్ లేని వాహనాలకు డబుల్ టోల్ ఫీజు చెల్లించాలన్న నిబంధన అమలవుతోందని తెలిపారు.
మరోవైపు, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై, 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్సీ రెన్యువల్‌కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక, ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 నుండి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది.ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్ కోసం రూ .12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, 2021 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.