Nitin Gadkari : రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరు..గడ్కరీ కీలక వ్యాఖ్యలు

దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News

దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల అంచనాలు అనే అంశంపై ఇవాళ రాజస్థాన్ అసెంబ్లీలో జరిగిన సెమినార్​లో పాల్గొన్న గడ్కరీ..సంతోష‌క‌రంగా ఉండే రాజ‌కీయ‌వేత్త‌ను చూడడం చాలా అరుదుగా జ‌రుగుతుంద‌న్నారు. అధికారం, ప‌ద‌విపై అభ‌ద్ర‌త వ‌ల్ల ఈ ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు.

మంత్రులు కాలేక‌పోయామ‌ని ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉంటార‌ని, మంచి శాఖ దొర‌క‌లేద‌ని మంత్రులు అసంతృప్తితో ఉంటార‌ని, మంచి శాఖ దొరికిన వాళ్లు.. సీఎం కాలేక‌పోయామ‌ని విచారిస్తుంటార‌ని, అయితే ఎన్నేళ్లు ఆఫీసులో ఉంటామో తెలియ‌ని భ‌యంలోనూ సీఎంలు ఉంటార‌ని నితిన్ గ‌డ్క‌రీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో బీజేపీ తన ముఖ్యమంత్రులను మార్చుతున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. గుజ‌రాత్ సీఎంగా విజ‌య్ రూపానీ త‌ప్పుకున్న సంద‌ర్భంలో గ‌డ్క‌రీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం మరింత ప్రాధాన‌త్య సంత‌రించుకున్న‌ది.

తాను బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో.. ఎవ‌రు కూడా అనాస‌క్త‌త‌తో లేర‌ని గడ్కరీ అన్నారు. హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాల‌ని ఓ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్ర‌శ్న‌కు.. భ‌విష్య‌త్తు గురించి ఆలోచించ‌నివాళ్లు సంతోషంగా ఉంటార‌ని గ‌డ్క‌రీ సమాధానమిచ్చారు. ఒక‌సారి తాను నాగపూర్‌లో ఓడిపోయిన‌ప్పుడు.. ఓ కాంగ్రెస్ నేత త‌న‌ను ఆ పార్టీలో చేరాల‌ని కోరార‌ని, కానీ తాను బీజేపీని వీడ‌లేద‌న్నారు. పార్టీ భావ‌జాలం ప‌ట్ల న‌మ్మ‌కంతో ఉండాల‌ని, మంచి రాజ‌కీయాల‌కు ఇదే పునాది అవుతుంద‌ని ఆయ‌న అన్నారు.

మరోవైపు, రాజకీయ నాయకుల గురించి సెటైర్ ర‌చ‌యిత శ‌ర‌ద్ జోషి రాసిన వ్యాఖ్య‌ల‌ను మంత్రి గుర్తు చేస్తూ..రాష్ట్రంలో పనిచేసేందుకు అనుగుణంగా లేని వ్యక్తులను ఢిల్లీకి పంపిస్తారు. ఢిల్లీకి సూట్ కాని నాయకులను గవర్నర్​లుగా నియమిస్తారు. గవర్నర్​లుగా నియామకం కాని వారిని రాయబారులుగా పంపిస్తారు. ఇది ప్రతి రాజకీయ పార్టీలో జరిగేదే అని చెప్పుకొచ్చారు.

ఇదే కార్యక్రమంలో ఇతర అంశాలపైనా నితిన్ గడ్కరీ మాట్లాడారు. రైతులు వరి, గోధుమలు పండించడమే కాకుండా పెట్రోల్, డీజిల్ సైతం తయారు చేయొవచ్చని అన్నారు. త్వరలో కేంద్రం “ఫ్లెక్స్ ఇంజిన్” విధానాన్ని ప్రవేశపెట్టనుందని తెలిపారు. వాహనాలను ఇథనాల్ లేని ఇంధనంతో నడపవచ్చని చెప్పారు. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఛత్తీస్​గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని.. సూపర్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా దీన్ని పరిష్కరించవచ్చని తెలిపారు. గ్రామాల్లోని నీటిని గ్రామాల్లో, నగరాల్లో నీటిని నగరాల్లోనే సంరక్షించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్న ఏళ్లనాటి నీటి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం, పంజాబ్-హర్యానా రాష్ట్రాలు వారిలో వారు తగాదా పడుతుంటే మూడు నదుల నీళ్లు పాకిస్థాన్​కు వెళ్లిపోతున్నాయని అన్నారు.

×