పెద్ద పార్టీలతో పొత్తులుండవు – అఖిలేశ్

  • Published By: madhu ,Published On : November 15, 2020 / 10:38 AM IST
పెద్ద పార్టీలతో పొత్తులుండవు – అఖిలేశ్

no alliance with larger parties akhilesh yadav : ఎన్నికల్లో ఇకపై పొత్తులకు పోమంటూ యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ క్లారిటీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ల తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద పార్టీలతో పొత్తు పెట్టుకునేది లేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు తేల్చి చెప్పారు. ఎస్పీ బహిష్కృత నేత, తన బాబాయ్ శివపాల్ యాదవ్‌తో కాంప్రమైజ్ అయిన విషయాన్ని అఖిలేశ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన బాబాయ్‌పై అభ్యర్థిని నిలపబోమని అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే.. తన బాబాయ్ శివపాల్ యాదవ్‌కు కేబినెట్‌లో చోటు ఖాయమని వివరించారు.



ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన బీజేపీ.. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించి దేశంలోని పెద్ద రాష్ట్రంపై తన పట్టు నిలుపుకుంది. ఎస్పీ, బీఎస్పీ వంటి పార్టీలు కలిసి పోటీ చేసినా.. బీజేపీ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా బరిలోకి దిగాలని.. కాంగ్రెస్, బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తు పెట్టుకోవద్దని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఓ నిర్ణయానికి వచ్చారు.



ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల పెద్దగా లాభం లేదని ఇటీవల బీహార్ ఎన్నికలు నిరూపించాయని.. అందుకే పెద్ద పార్టీలో పొత్తు పెట్టుకోవద్దనే నిర్ణయానికి ఎస్పీ వచ్చిందని రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే కలిసికట్టుగా బీజేపీని ఓడించలేకపోయిన సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు వేర్వేరుగా బరిలోకి దిగి బీజేపీని ఓడించగలుగుతాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.