కరోనా కట్టడిలో ఢిల్లీ విజయం…40గంటల్లో ఒక్క కేసు కూడా లేదన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2020 / 12:23 PM IST
కరోనా కట్టడిలో ఢిల్లీ విజయం…40గంటల్లో ఒక్క కేసు కూడా లేదన్న కేజ్రీవాల్

దేశరాజధాని ఢిల్లీలో పూర్తిస్థాయిలో కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. గడిచిన 40గంట్లలో ఢిల్లీలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదుకాలేదని మంగళవారం(మార్చి-24,2020)సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఒకవేళ కరోనా మహమ్మారి కనుక ఢిల్లీలో 3వ దశలోకి ప్రవేశిస్తే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఓ ఫ్లాన్ ను సూచించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఐదుగురు సభ్యుల డాక్టర్ల టీమ్ ను నియమించినట్లు కూడా సీఎం తెలిపారు. 

ఢిల్లీలో నమోదైన 30కరోనా కేసుల్లో ఇప్పటివరకు కొంతమంది కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇళ్లకు వెళ్లిపోయారు. ఢిల్లీలో ఇప్పుడు 23మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారని కేజ్రీవాల్ తెలిపారు. ఇది గుడ్ న్యూస్ కానీ ఫైట్ ఇంకా ఉంది కనుక మనం సంతోషపడకూదని కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా తెలిపారు. నంబర్లు ఎప్పుడైనా పెరగవచ్చని,మనం అలర్ట్ గానే ఉండాలని కేజ్రీవాల్ తెలిపారు.

అంతేకాకుండా తమ ఇళ్లల్లో అద్దెకు ఉండేవాళ్లకు కొంత అద్దె తగ్గించాలని లేదా 2-3నెలలవరకు అద్దె గడువును కూడా ఇళ్ల ఓనర్లకు కేజ్రీవాల్ విజ్ణప్తి చేశారు. ఢిల్లీలో రోజువారీ కూలీలు చాలామంది అద్దె ఇళ్లల్లో ఉంటారని కేజ్రీ తెలిపారు. అంతేకాకుండా కనస్ట్రక్షన్(నిర్మాణ)వర్కర్లు ఒక్కొక్కరికి రూ.5వేలు ఇవ్వనున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కారణంగా వారు పనులు ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అంతేకాకుండా ఢిల్లీలో నైట్ షెల్టర్ల సంఖ్యను కూడా పెంచుతున్నట్లు కేజ్రీ ప్రకటించారు.

దేశంలోని అన్నిరాష్ట్రాలకంటే ముందే..వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీలో సినిమా థియేటర్లు,మాల్స్,రెస్టారెంట్లు,పబ్ లు,స్విమ్మింగ్ పూల్స్,స్కూల్స్,కాలేజీలు అన్నింటిని మూసివేసిన విషయం తెలిసిందే. ప్రజలు గుంపులుగా తిరగడానికి వీల్లేకుండా కేజ్రీవాల్ సర్కార్ ఆంక్షలు విధించింది.