సోషల్ మీడియా ద్వారా వైద్య సాయం కోరేవారిని వేధిస్తే కఠిన చర్యలు..రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్

మే-1నుంచి దేశ‌వ్యాప్తంగా మూడోద‌శ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై శుక్రవారం కేంద్రాన్ని నిల‌దీసింది సుప్రీంకోర్టు.

సోషల్ మీడియా ద్వారా వైద్య సాయం కోరేవారిని వేధిస్తే కఠిన చర్యలు..రాష్ట్రాలకు సుప్రీం వార్నింగ్

Supreme Court

Supreme Court మే-1నుంచి దేశ‌వ్యాప్తంగా మూడోద‌శ క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌పై కేంద్రాన్ని నిల‌దీసింది సుప్రీంకోర్టు. కరోనా వ్యాక్సిన్ ల కొనుగోలులో భాగంగా కేంద్రం, రాష్ట్రాల వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందనికేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా కట్టడి చర్యలపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీనాక్షి అరోరా, జైదీప్ గుప్తా అమికస్ క్యూరీగా హాజరయ్యారు.

టీకాలు మొత్తం కేంద్రమే ఎందుకు కొనడం లేదని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా కేంద్రాన్ని ప్రశ్నించింది. నేషనల్ ఇమ్యూనైజేషన్ మోడల్ ప్రకారం వ్యాక్సిన్ సేకరణ పూర్తిగా కేంద్రమే చేపట్టి,పంపిణీ వికేంద్రీకరించవచ్చు కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సిన్ ధ‌ర‌ల అంశం అనేది చాలా తీవ్ర‌మైన‌ది. కేంద్రానికి వ‌చ్చిన వ్యాక్సిన్ల‌లో 50 శాతం ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు, 45 ఏళ్ల పైబ‌డిన వాళ్ల‌కు ఇస్తామ‌న్నారు. మిగ‌తా 50 శాతం రాష్ట్రాలు వాడుకోవ‌చ్చ‌న్నారు. 59.46 కోట్ల మంది భార‌తీయులు 45 ఏళ్ల లోపు వాళ్లే. వీళ్ల‌లో చాలా మంది నిరుపేద‌, అణ‌గారిన వ‌ర్గాలే. వాళ్లు వ్యాక్సిన్ల‌కు డ‌బ్బులు ఎక్క‌డి నుంచి తెస్తారు అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు నిల‌దీసింది.

18-44 ఏళ్ల వ‌య‌సు వారికి ప్ర‌భుత్వ‌మే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్య‌మ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. ఎన్ని వ్యాక్సిన్లు ఉత్ప‌త్తి అవుతున్నాయో మాకు తెలుసు. మీరు ఉత్ప‌త్తిని పెంచేలా చూడాలి. ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిని పెంచాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి వివరాలు చెప్పాలని కోర్టు పేర్కొంది. కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తోంది లేక రాష్ట్రాలకే వదిలివేసిందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

ఇక రాష్ట్రాల‌కు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. పౌరులు సోషల్ మీడియా, ఇంటర్నెట్ వేదికగా సహాయం కోరడాన్ని తప్పుడు సమాచారం అనలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. సోష‌ల్ మీడియాలో ఎవ‌రైనా హాస్పిట‌ల్ బెడ్ లేదా ఆక్సిజ‌న్ కోసం అప్పీల్ చేసిన‌ప్పుడు వారిని వేధించిన‌ట్లు తెలిస్తే దానిని కోర్టు ధిక్క‌ర‌ణ కిందే ప‌రిగ‌ణిస్తాం. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీల‌కు వెళ్లాల్సిందే. ఏ స‌మాచారాన్ని రాష్ట్రాలు క‌ప్పిపుచ్చే ప్ర‌య‌త్నం చేయొద్దు. సమాచారాన్ని అదుపు చేయడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని..ప్ర‌స్తుతం మ‌న జాతీయ సంక్షోభంలో ఉన్నాము అని జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.