Vaccination : వ్యాక్సిన్‌ వేసుకుంటే మరణం ముప్పు తక్కువ

వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Vaccination : వ్యాక్సిన్‌ వేసుకుంటే మరణం ముప్పు తక్కువ

Aiims Vaccination

AIIMS : ఏడాదిన్నర కావొస్తోంది. ఇంకా కరోనావైరస్ మహమ్మారి పీడ పోలేదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. మన దేశంలో సెకండ్ వేవ్ లో కరోనా మరింత విలయం సృష్టిస్తోంది. నిత్యం లక్షల సంఖ్య కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ అని నిపుణులు చెబుతున్నారు.

ప్రజలందరికి టీకాలు ఇవ్వడం ద్వారా కరోనాను ఖతం చేయొచ్చని సూచిస్తున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేశాయి. ప్రారంభంలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రాలేదు. ఆ తర్వాత వ్యాక్సిన్ తోనే పూర్తి రక్షణ అని తెలిశాక తమ అభిప్రాయం మార్చుకున్నారు. టీకాల కోసం క్యూ కట్టారు.

తాజాగా వ్యాక్సిన్ వల్ల కలిగే ప్రయోజనాలను ఎయిమ్స్ నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ల సామర్థ్యంపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంతృప్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి కరోనా సోకినా తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని ఎయిమ్స్‌ తాజా అధ్యయనంలో వెల్లడైంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకిన వాళ్లలో ఎలాంటి మరణాలు సంభవించ లేదంది. జన్యుక్రమ పరిశీలనలో భాగంగా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొవిడ్‌కు గురైన 63 మంది ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ నిపుణులు గమనిస్తూ వచ్చారు.

వీరిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్క డోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారే. మొత్తంగా 53 మంది కొవాగ్జిన్‌, 10 మంది కొవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. రెండు డోసులు తీసుకున్న వారిలో 52.8% మంది, ఒక్క డోసు తీసుకున్న వారిలో 47.2% మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరికి 5 నుంచి 7 రోజుల పాటు జ్వరం వచ్చినా, తీవ్రస్థాయి అనారోగ్యం బారిన పడలేదని, ఆసుపత్రి పాలు కాలేదని నిపుణులు గుర్తించారు. పైగా మరణాల ముప్పు కూడా తగ్గిందన్నారు. టీకా తీసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డ వారిలో ఒక్కరు కూడా చనిపోలేదని తమ అధ్యయనంలో తేలిందని ఎయిమ్స్ నిపుణులు తెలిపారు. మొత్తంగా వ్యాక్సిన్ తో కరోనా మృత్యుభయం ఉండదని తేల్చారు. అందుకే టీకా తీసుకోవడం అన్ని విధాలుగా మంచిదని చెబుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో టీకాతో సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు.