అవసరమే లేదు…NPRపై అమిత్ షా కీలక ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2020 / 03:29 PM IST
అవసరమే లేదు…NPRపై అమిత్ షా కీలక ప్రకటన

జాతీయ పౌరపట్టిక(NPR) పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభ సాక్షిగా కీలక ప్రకటన చేశారు. ఎన్పీఆర్ విషయంలో ఎలాంటి పత్రాలు అవసరం లేదని అమిత్‌షా పునరుద్ఘాటించారు. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ జాబితాలో ‘సందేహాస్పద’ (D) అనే కేటగిరీ ఉండదని షా ప్రకటించారు.

NPR విషయంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎవరికైనా సందేహముంటే, వాటిని తీర్చడానికి కేంద్ర హోంశాఖా సదా సిద్ధంగానే ఉందని ప్రకటించారు. సీఏఏ విషయంలో ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదని, కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సీఏఏతో ఎవరి పౌరసత్వం రద్దు కాదని, పౌరసత్వం లభించేదే సీఏఏ అని అమిత్‌షా మరోసారి సృష్టం చేశారు.

అయితే అమిత్ షా స్పష్టతపై కాంగ్రెస్‌ అనుమానం వ్యక్తం చేసింది. ఈ పత్రాలను అడగరని హోం మంత్రి చెప్పడం సరైనది కాదు, అప్పుడు ఈ NPR ప్రక్రియ యొక్క ఉపయోగం ఏమిటి అని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు.

ఇప్పటికే ఎన్ ఆర్సీ ప్రక్రియ చేపట్టబోమని కేరళ,వెస్ట్ బెంగాల్,బీహార్,రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా ఎన్ పీఆర్ ప్రక్రియ చేపట్టబోమంటూ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్ పీఆర్ ప్రక్రియ పై రాష్ట్రం సందేహాలను కేంద్రం తీర్చనంతవరకు ఎన్ పీఆర్ చేపట్టే ప్రశక్తే లేదని అన్నా డీఎంకే తేల్చి చెప్పింది.