సీఏఏ అమలు చేయకుండా ఏ రాష్ట్రం తప్పించుకోలేదు

  • Published By: venkaiahnaidu ,Published On : January 1, 2020 / 03:06 PM IST
సీఏఏ అమలు చేయకుండా ఏ రాష్ట్రం తప్పించుకోలేదు

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుచేసే ప్రశక్తే లేదంటూ వెస్ట్ బెంగాల్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్,పంజాబ్,కేరళ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి  సీఏఏను ఎత్తివేయాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ సమయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం(జనవరి-1,2020) కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఏఏ అమలు చేయకుండా ఏ ఒక్కరాష్ట్రం తప్పించుకోలేదని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ…ఓటు బ్యాంకు రాజకీయాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను అమలు చేయనివ్వమంటూ బాహాటంగా ప్రకటనలు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. వారందరికీ నేనిచ్చే మర్యాదపూర్వక సలహా ఒకటే. దయచేసి మీరంతా న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 245, 256 సహా ఇతర అధికరణల ప్రకారం పౌరసత్వానికి సంబంధించిన చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఆర్టికల్‌ 256 ప్రకారం కేంద్రం తీసుకువచ్చిన చట్టాలతో విభేదించకూడదని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియదా అని ప్రశ్నించారు. 

ఉభయ సభల్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత.. రాష్ట్రపతి సంతకంతో పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. కాబట్టి ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఎవరూ అడ్డుకోలేరు. ప్రజాప్రతినిధులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసినపుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామన్న మాటలను మరోసారి గుర్తుచేసువాలని కేంద్రమంత్రి తెలిపారు.

సీఏఏ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలను ఆమోదించడానికి తాము ఆసక్తి చూపడం లేదని, ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణ కోసం వేచి ఉంటామని కాంగ్రెస్ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాకే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ బాలాసాహెబ్ థరోట్ కూడా చెప్పారు.