ఎలా ఫైన్ వేస్తారో చూస్తా : ట్రాఫిక్ పోలీసులకు ఝలక్.. హెల్మట్‌కు డాక్యుమెంట్లు అతికించి బైక్ రైడ్

  • Published By: sreehari ,Published On : September 10, 2019 / 08:05 AM IST
ఎలా ఫైన్ వేస్తారో చూస్తా : ట్రాఫిక్ పోలీసులకు ఝలక్.. హెల్మట్‌కు డాక్యుమెంట్లు అతికించి బైక్ రైడ్

ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు. హెల్మట్ దగ్గర నుంచి వాహన పత్రాల వరకు అన్ని ఉండాల్సిందే. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా ఫైన్ మోత మోగిపోవడం ఖాయం. ఒక డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. వాహనదారులు రోడ్డు మీదికి రావాలంటేనే భయపడిపోతున్నారు.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి రావడంతో కొన్నిరోజులుగా వందల సంఖ్యలో వాహనదారులకు భారీగా చలాన్లు నమోదయ్యాయి. వేలాది రూపాయల జరిమానాలు చెల్లించాల్సి వచ్చింది. భారీగా జరిమానాలు చెల్లించలేక వాహనదారులు లబోదిబోమంటున్నారు. బండి బయటకు తీయాలా వద్దా? వాహనదారులు డైలమాలో పడిన పరిస్థితుల్లో వడోదరకు చెందిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. ట్రాఫిక్ ఉల్లంఘన కింద జరిమానాలు విధిస్తున్న పోలీసులకు గట్టి ఝలక్ ఇచ్చాడు. 

తన బైక్ కు అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయి. అతడి పేరు రామ్ షా.. ఇతడో ఇన్యూరెన్స్ ఏజెంట్ కూడా. ప్రతి రోజు తన బైక్ మీద ట్రావెల్ చేస్తుంటాడు. ప్రతిసారి బండి డాక్యుమెంట్లను తీసుకెళ్లడం ఇబ్బంది అనుకున్నాడేమో.. ఎక్కడ మరిచిపోతానేమోనని ఏకంగా డాక్యుమెంట్లను తెలివిగా తన హెల్మట్‌కు అతికించాడు. బైక్ RC, ఇన్సూరెన్స్ స్లిప్, PUC సర్టిఫికేట్ తన హెల్మట్ కు ఇరువైపులా అతికించాడు. వర్షం వస్తే ఎక్కడ తడుస్తాయేమోనని కవర్ తోనే అతికించాడు.

అతడు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. పోలీసులు ఆపి బండి కాగితాలు చూపించమన్నారు. ఇదిగో చూసుకోండి.. హెల్మట్ చూపించాడు. అంతే.. ట్రాఫిక్ పోలీసులు కంగు తిన్నారు. అతడు చేసిన పనికి నవ్వుకున్న పోలీసులు ట్రాఫిక్ రూల్స్ పాటించినందుకు హ్యాపీగా ఫీలయ్యారు. దీనిపై బైక్ రైడర్ రామ్ స్పందిస్తూ.. ఎక్కడికి వెళ్లినా అన్ని డాక్యుమెంట్లు నాతోనే ఉంటాయి. రోడ్డుపై బైక్ మీద వెళ్లేటప్పుడు కంగారు పడక్కర్లేదు. ఎలాంటి జరిమానాలు కూడా చెల్లించాల్సిన పని లేదు’ అని చెప్పాడు. 

రానున్న రోజుల్లో గుజరాత్ ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి తేనుంది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే వాహనదారులకు భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇటీవల గుజరాత్ పోలీసు అధికారి ఒకరు హెల్మట్ లేకుండా బైక్ నడిపడం, ఫోన్ మాట్లాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫొటో ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ గుర్తించి అతడికి రూ.1,100 జరిమానా విధించారు.