Gas Subsidy : మొన్న పెట్రోల్, నిన్న డీజిల్.. నేడు గ్యాస్ సిలిండర్.. కేంద్రం మరో షాక్

ఇటీవలే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. వినియోగదారులు హమ్మయ్య అని ఊపిరిపీల్చుకునేలోపే మరో రూపంలో బాదేసింది.

Gas Subsidy : మొన్న పెట్రోల్, నిన్న డీజిల్.. నేడు గ్యాస్ సిలిండర్.. కేంద్రం మరో షాక్

Gas Subsidy

Gas Subsidy : కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేస్తునట్టు తెలిపింది. దీంతో ఇకపై మార్కెట్ రేటుకే సిలిండర్ కొనాల్సి ఉంటుంది. గృహ వినియోగదారులకు ఇచ్చే గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడిన కేంద్రం.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. కేంద్రం నిర్ణయంతో 21 కోట్ల మందికి సబ్సిడీని దూరం చేసినట్లు అవుతుంది. కొన్ని రోజులుగా సబ్సిడీని భారీగా తగ్గించిన కేంద్రం.. కొంతకాలంగా రూ.40 వరకు సబ్సిడీ ఇచ్చేది. ఇప్పటినుంచి అది కూడా నిలిచిపోనుంది.

గతంలో గ్యాస్ బండపై రూ.200 వరకు సబ్సిడీ వచ్చేది. తర్వాత దాన్ని గణనీయంగా తగ్గిస్తూ వచ్చారు. తర్వాత కొన్ని నెలలుగా ఒక్కో సిలిండర్ పై రూ.40 వరకు సబ్సిడీ మొత్తాన్ని వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా ఎత్తివేసింది కేంద్రం. ప్రస్తుతం దేశంలో 30 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో ఉజ్వల కనెక్షన్లు కేవలం 9 కోట్లు మాత్రమే. అంటే మిగిలిన 21 కోట్ల మంది మార్కెట్ రేటుకి అనుగుణంగా గ్యాస్ బండ కొనాల్సి ఉంటుంది. ఇటీవలే కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వినియోగదారులు హమ్మయ్య అనేకునే లోపే కేంద్రం మరో రూపంలో బాదేసింది.

No LPG subsidy: వంట గ్యాస్ సిలిండర్‌పై సబ్సిడీ కట్.. ఇకపై ఉజ్వల పథక లబ్ధిదారులకే

దేశంలో కరోనా ఉధృతి ప్రారంభమైన 2020 జూన్ నుంచి వంట గ్యాస్ పై సబ్సిడీ నిలిపివేశామని ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ తెలిపారు. అయితే ఉజ్వల పథకం కింద కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రం సిలిండర్ కు రూ.200 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా దాదాపు 9 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.6వేల 100 కోట్ల భారం పడుతోందని కేంద్రం వివరించింది.

ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ లభించనుంది. సాధారణ గృహ వినియోగదారులు ఇకపై మార్కెట్‌ ధర ఎంత ఉంటే అంత చెల్లించాల్సిందే.

2010లో పెట్రోల్‌పై సబ్సిడీని కేంద్రం ఎత్తివేయగా.. 2014 నవంబర్‌లో డీజిల్‌పైనా సబ్సిడీని తొలగించారు. అక్కడికి రెండేళ్లకు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా.. తాజాగా గ్యాస్‌పై ఇస్తున్న సబ్సిడీకీ కేంద్రం మంగళం పాడేసింది.