Covid-19 Vaccines : మిక్స్డ్ వ్యాక్సిన్.. భారత్‌లో టీకా కాంబినేషన్ కుదురుతుందా?

సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. మిక్స్ వ్యాక్సిన్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

Covid-19 Vaccines : మిక్స్డ్ వ్యాక్సిన్.. భారత్‌లో టీకా కాంబినేషన్ కుదురుతుందా?

Covid 19 Vaccines

Covid-19 Vaccines : సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్.. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్.. ఈ రెండూ కరోనా వ్యాక్సిన్లే. మరి.. రెండు డోసుల్లో వేర్వేరు కంపెనీలకు చెందిన టీకాలు ఎందుకు వేసుకోకూడదు. ఒక్కోసారి ఒక్కోటీ వేసుకుంటే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఇప్పుడు అందరిలోనూ ఇదే ప్రశ్న. మిక్స్ వ్యాక్సిన్ గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కాగా, మిక్స్ వ్యాక్సిన్ వేసుకున్నా ఏమీ కాదనే అధ్యయనాలు ఉన్నప్పటికి, భారత్ లో మాత్రం ఇప్పుడది సాధ్యమయ్యే పరిస్థితి లేదంటున్నారు. ఫస్ట్, సెకండ్ డోసులను మార్చి వేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ల కొరత ఎక్కువగా ఉంది. మొదటి డోసుగా ఒకటి వేసుకున్న తర్వాత రెండో డోసుగా అదే వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం లేదు. దీంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో రెండు రకాల వ్యాక్సిన్లు వేసుకుంటే ఏమవుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండూ… కరోనా కట్టడి వ్యాక్సిన్లే అయినప్పుడు.. రెండు వేర్వేరు డోసుల్లో వేసుకుంటే కలిగే ఇబ్బంది ఏంటనేది సందేహం. అయితే ఇలా రెండు డోసుల్లో రెండు కంపెనీల వ్యాక్సిన్లు వేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయినప్పటికి భారత్ లో మాత్రం మిక్స్డ్ వ్యాక్సిన్ ప్రక్రియ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ చెబుతున్నారు.

మిక్స్డ్ వ్యాక్సిన్లపై ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. యూకేలో ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, ఫైజర్, బయోఎన్ టెక్ వ్యాక్సిన్ల కాంబినేషన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇండియాలో మాత్రం కోవాగ్జిన్, కోవిషీల్డ్ మిక్స్డ్ ట్రయల్స్ ఇప్పుడు జరగవన్నారు. రెండు వేర్వేరు డోసులు వేసుకోవడం సాధ్యమైనప్పటికి.. భారత్ లో ఇప్పుడప్పుడే ఆచరణలోకి వచ్చే చాన్స్ లేదన్నారు. కాంబినేషన్ ఆఫ్ వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికి, వాటి ఫలితాలను ఇంకా అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో వ్యాక్సిన్ కాంబినేషన్ కుదరదని తేల్చి చెప్పారు వీకే. దీనిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందన్నారు.