కేంద్రం సంచలన ప్రకటన…ఏడాది పాటు కొత్త పథకాల్లేవ్

  • Published By: venkaiahnaidu ,Published On : June 5, 2020 / 09:31 AM IST
కేంద్రం సంచలన ప్రకటన…ఏడాది పాటు కొత్త పథకాల్లేవ్

ఓ ఏడాది పాటు కొత్త ప్రభుత్వ పథకాలు ఏవీ ఉండబోవని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఖర్చును టైట్ చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొత్త పథకాల కోసం అభ్యర్థనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే చెప్పబడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ మరియు ఇటీవల ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలకు మాత్రమే ఖర్చు చేయడం అనుమతించబడుతుంది. ఈ ఆర్థికసంవత్సరంలో మరే ఇతర స్కీమ్ లేదా పథకం అనుమతించబడదని నిర్మలా సీతారామన్ సృష్టం చేశారు. COVID-19 మహమ్మారి నేపథ్యంలో… ప్రజల ఆర్థిక వనరులపై అపూర్వమైన డిమాండ్ ఉందని మరియు అభివృద్ధి చెందుతున్న, మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను వివేకంతో ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రి తెలిపారు.

బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదించబడిన పథకాలను వచ్చే మార్చి-31వరకు నిలిపివేస్తున్నట్లు ఆమె తెలిపారు. 11ఏళ్లల్లో జీడీపీ వృద్ధి తగ్గిపోవడం, నాలుగు దశాబ్దాలకు పైగా ఆర్థిక అంచనాల్లో తగ్గుదల వంటి తీవ్రమైన వరుస ఆర్థిక సంకేతాల తర్వాత కేంద్రం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. భారత క్రెడిట్ రేటింగ్ కూడా బాగా తగ్గిపోయింది. భారత్ ను అతితక్కువ పెట్టుబడి గ్రేడ్ లెవల్ కి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తగ్గించింది.