AMU మినీ ఇండియా… మతం ఆధారంగా ఎవర్నీ నిర్లక్ష్యం చేయట్లేదన్న మోడీ

AMU మినీ ఇండియా… మతం ఆధారంగా ఎవర్నీ నిర్లక్ష్యం చేయట్లేదన్న మోడీ

Modi at Aligarh Muslim University centenary celebrations ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ(AMU) శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న AMUపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు కురిపించారు.

AMUని”మిని ఇండియా”గా అభివర్ణించారు మోడీ. అనేక మంది స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను అలీఘ‌ర్ ముస్లిం యూనివ‌ర్సిటీ ఇచ్చింద‌ని తెలిపారు. ఆ యోధుల్లో సైద్దాంతిక తేడాలు ఉన్నా..స్వాతంత్ర్యం‌ కోసం వారు త‌మ మ‌ధ్య ఉన్న విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి పనిచేశారని అన్నారు. స్వాతంత్య్రోద్య‌మం ఎలాగైతే మ‌న‌ల్ని ఐక్యం చేసిందో.. అదే విధంగా న‌యా భార‌త్ కోసం ప‌నిచేయాల‌ని ప్ర‌ధాని అన్నారు.

కరోనా మ‌హ‌మ్మారి వేళ కూడా అలీఘ‌ర్ వ‌ర్సిటీ స‌మాజానికి అసాధార‌ణ రీతిలో సాయం చేసింద‌న్నారు. ఉచితంగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించింద‌ని, ఐసోలేష‌న్ వార్డుల‌ను ఏర్పాటు చేశార‌ని, ప్లాస్మా బ్యాంకుల‌ను క్రియేట్ చేశార‌ని, పీఎం కేర్స్ ఫండ్‌కు కూడా వ‌ర్సిటీ నిధుల‌ను ఇచ్చిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. స‌మాజ శ్రేయ‌స్సు ప‌ట్ల అలీఘ‌ర వ‌ర్సిటీ ఎంత దీక్ష‌తో ఉన్న‌దో దీన్ని బ‌ట్టి అర్థం అవుతోంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

ఏఎంయూ క్యాంప‌స్ ఓ మ‌హాన‌గ‌రంలా ఉంటుంద‌ని త‌న‌తో ప్ర‌జ‌లు చెబుతుంటార‌ని, ప్ర‌తి శాఖ‌లోనూ మినీ ఇండియాను చూడ‌వ‌చ్చని ప్ర‌ధాని అన్నారు భిన్న‌త్వ‌రంలో ఏక‌త్వ శ‌క్తిని ఎవ‌రూ మ‌రిచిపోరాదు అని, దాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌వ‌ద్దని తెలిపారు. ఏక్ భార‌త్‌, శ్రేష్ట్ భార‌త్ అన్న స్పూర్తితో అంద‌రం క‌లిసి ప‌నిచేయాల‌న్నారు.

ముస్లిం మ‌హిళ‌ల్లో స్కూల్ డ్రాపౌట్ 70 శాతం ఉండేద‌ని, గ‌త 70 ఏళ్లు ఇలాంటి ప‌రిస్థితే ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో త‌మ ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ ప్రారంభించింద‌న్నారు. గ్రామాలు, స్కూళ్ల‌ల్లో టాయిలెట్లు నిర్మించామ‌ని, దీని ద్వారా స్కూల్ విద్యార్థినుల డ్రాపౌట్ 30 శాతానికి ప‌డిపోయిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

మ‌తాల‌కు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రికీ రాజ్యాంగ హ‌క్కులు అందే విధంగా దేశం ముందుకు వెళ్తున్న‌ట్లు ప్ర‌ధాని అన్నారు. మ‌తం ఆధారంగా ఏ ఒక్క వ‌ర్గాన్ని కూడా నిర్ల‌క్ష్యం చేయ‌డం లేద‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రి క‌ల‌లు సాక‌రం అయ్యేలా చూస్తున్నామ‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు మ‌త వ్య‌త్యాసాలు లేకుండా పేద ప్ర‌జ‌ల‌కు అందుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దేశాభివృద్ధి, ప్ర‌గ‌తి విష‌యంలో సైద్ధాంతిక విభేదాల‌ను ప‌క్క‌న పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏ మ‌తంలో పుట్టినా.. జాతీయ ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా ప్ర‌జాజీవ‌నం ఉండాల‌న్నారు.