భారత్ లో అంగుళం భూమిని కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు…లడఖ్ లో రక్షణ మంత్రి..పారాట్రూపర్ల విన్యాసాలు అదుర్స్

  • Published By: venkaiahnaidu ,Published On : July 17, 2020 / 09:06 PM IST
భారత్ లో అంగుళం భూమిని కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు…లడఖ్ లో రక్షణ మంత్రి..పారాట్రూపర్ల విన్యాసాలు అదుర్స్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధఖ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ అనూహ్యంగా లడఖ్ లో పర్యటించగా…ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ పర్యటిస్తున్నారు.

రాజ్ నాథ్ వెంట డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవనె సహా ఉన్నత సైనికాధికారులు కూడా ఉన్నారు. సైనిక సన్నద్ధతను వివరించేందుకు భారత సేనలు నిర్వహించిన సాహస విన్యాసాలను రక్షణ మంత్రి ఈ సందర్భంగా వీక్షించారు.

రాజ్‌నాథ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార‌తీయ పారాట్రూప‌ర్లు లడఖ్ లోని గ‌గ‌న‌త‌లంలో సైనిక విన్యాసాలు చేశారు. ఆక్సిజ‌న్ మాస్కులు ధ‌రించిన‌ పారాట్రూప‌ర్లు అమెరిక‌న్ సీ130జే సూప‌ర్ హెర్క్యుల‌స్‌ విమానంలో నుంచి ఒక‌రి వెంట‌ మ‌రొక‌రు దూకుతూ శ‌క్తిసామ‌ర్థ్యాల‌ను చాటుకున్నారు. వీటిని వీక్షించిన అనంత‌రం రాజ్‌నాథ్ సింగ్ జ‌వాన్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ…ప్రపంచంలోని ఏ శక్తీ భారతభూమి నుంచి ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదని అన్నారు. చర్చల ద్వారా మాత్రమే సరిహద్దు వివాదాలు పరిష్కారం అవుతాయని, ఇంత కంటే మరో మంచి మార్గం ఉండదని రక్షణ మంత్రి తెలిపారు.

భారత్-చైనా సరిహద్దు వివాదం పరిష్కరించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే అవి ఎంతవరకు ఫలవంతమవుతాయో నేను చెప్పలేను. కానీ నేను ఒక్క భరోసా ఇవ్వగలను. ప్రపంచంలోని ఏ శక్తీ భరతభూమి నుంచి ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. భారత్​-చైనా మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న వేళ… ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రపంచానికి భారత్ శాంతి సందేశం ఇచ్చిందని చెప్పిన రాజ్ నాథ్…‌పరిస్థితి విషమిస్తే దీటుగా జవాబిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. భారత సార్వభౌమత్వంపై దాడి చేస్తే ఉపేక్షించబోమన్నారు. భారత ఆత్మగౌరవాన్ని ఎవరూ దెబ్బతీయలేరని స్ప్రష్టం చేసారు. దేశ గౌరవం అన్నింటి కంటే చాలా గొప్పదన్నారు.

శనివారం మధ్యాహ్నం శ్రీనగర్‌కు వెళ్లనున్నారు మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాకిస్థాన్ సరిహద్దుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న భారత సరిహద్దు దళాలతో మాట్లాడుతారు. సైనికాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఇటు పాకిస్థాన్, అటు చైనా సరిహద్దుల వెంబడి భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న తరుణంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అక్కడ పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.