Pegasus వివాదంపై పెదవి విప్పిన కేంద్రం

పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది.

Pegasus వివాదంపై పెదవి విప్పిన కేంద్రం

Pegasus

Pegasus  పార్లమెంట్ ను కుదిపేస్తున్న పెగసస్ ఫోన్ ట్యాపింగ్​ వ్యవహారంపై కేంద్రప్రభుత్వం మౌనం వీడింది. పెగాసస్ తయారీదారుతో కేంద్రం కుమ్మక్మై దేశంలోని హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు,విపక్ష నేతలు,ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టిందన్న విమర్శల నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసస్ తయారీదారు అయిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తో కేంద్రం ఎలాంటి లావాదేవీలు జరపలేదని రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పార్లమెంటులో ప్రకటించారు. ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ టెక్నాలజీస్‌ తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా? అని సీపీఎం ఎంపీ శివదాసన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ఈ మేరకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

అయితే కేంద్రం ప్రకటన తర్వాత కూడా విపక్షం సంతృప్తి చెందలేదు. పెగాసస్ తయారీదారు ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తాము ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే నిఘా సాఫ్ట్ వేర్ అమ్మినట్లు చెప్తున్న నేపథ్యంలో విపక్షాలు మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేయడం మానడం లేదు. ఇవాళ కూడా పార్లమెంటు ఉభయసభల్ని విపక్షాలు స్తంభింపజేశాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ చెప్పలేమంటూ కేంద్రం చెప్తున్నా విపక్షాలు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో పార్లమెంటు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

అయితే, భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు తేవడమే లక్ష్యంగా కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలే ఇవన్నీ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇటీవల అన్నారు. భారత్‌లో అనధికారిక నిఘా సాధ్యం కాదని, ఇక్కడ చట్టాలు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీనిపై పార్లమెంటరీ స్థాయి దర్యాప్తునకు డిమాండ్‌ చేస్తున్నాయి.

READ :Pegasus Row : తీవ్రంగా పరిగణిస్తాం..పెగాసస్ దుమారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు