ఏప్రిల్ 30వరకు నోయిడాలో 144సెక్షన్

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 10:07 AM IST
ఏప్రిల్ 30వరకు నోయిడాలో 144సెక్షన్

కరోనా కేసులు రోజురోజుకీ భారత్ లో పెరిగిపోతుండటం,ముఖ్యంగా పొరుగునున్న ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సభ్యుల కారణంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో నోయిడా అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. 144 సెక్షన్ విధింపును ఏప్రిల్-30,2020వరకు పొడించేలా నోయిడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

144సెక్షన్ ప్రకారం… ఒక చోట నలుగురు కన్నా ఎక్కువమంది గుమికూడగూడదు. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ద్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ గా నోయిడా ఉన్న విషయం తెలిసిందే. గౌతమ్ బుద్ద్ నగర్ లో ఇప్పటివరకు 58కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. 

ఇదిలావుండగా, గౌతమ్ బుద్ధ నగర్ కొత్త జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ LY జిల్లా అధికారులను హెచ్చరించారు. కరోనావైరస్ పై పోరాటం సమయంలో తప్పించుకుని తిరుగుతున్న అధికారులు,24 గంటల్లో డ్యూటీ కోసం రిపోర్ట్ చేయడంలో విఫలమైతే వారిని సర్వీసు నుంచి తొలగించనున్నట్లు శనివారం జిల్లా అధికారులను హెచ్చరించారు. జిల్లాలో కరోనా వైరస్ సంక్షోభం మధ్య…డ్యూటీ కోసం రిపోర్ట్ చేయని 51 మంది అధికారులను లక్ష్యంగా చేసుకుని ఆయన శనివారం ఆదేశాలు జారీ చేశారు.

ఆయన ఆర్డర్ తర్వాత 34 మంది అధికారులు డ్యూటీ కొరకు రిపోర్ట్ చేశారు. కాని 17 మంది ఇంకా హాజరుకాలేదు. కొత్త డిఎమ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, సుహాస్ ఒక కరోనా కాల్ సెంటర్ హెల్ప్‌లైన్ 1800-4192-211 ను ఏర్పాటు చేసి, ఈ వ్యాధిపై ప్రజలకు సమాచారం అందించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించిన దేశవ్యాప్త లాక్ డౌన్ ఏప్రిల్-14,2020తో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించే ఉద్దేశ్యం లేదని ఇటీవల కేంద్రం ప్రకటించినప్పటికీ,కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కూడా లేకపోలేదు.