హెల్మెట్ పెట్టుకోలేదని బస్సు డ్రైవర్ కు ఫైన్ 

  • Published By: chvmurthy ,Published On : September 20, 2019 / 04:16 PM IST
హెల్మెట్  పెట్టుకోలేదని బస్సు డ్రైవర్ కు ఫైన్ 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే మరి కొన్నిరాష్ట్రాల్లో ఇంకా ప్రజలకు అవగాహన కలిగించే దిశగా యత్నాలు సాగుతున్నాయి. మరో వైపు కొత్త మోటారు వాహాన చట్టంపై సోషల్ మీడియాలో సెటైర్లు విపరీతంగా పేలుతున్నాయి. తాజాగా బస్సు డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని పోలీసులు రూ. 500 జరిమానా విధించారు.

నోయిడాలోని నిరంకర్ సింగ్ అనే ట్రాన్స్ పోర్టు సంస్ధ యజమానికి 80 బస్సులు ఉన్నాయి. వాటిని అద్దె ప్రాతిపదికన స్కూళ్లకు తిప్పుతుంటాడు. వాటిలోని ఒక స్కూల్ బస్సు డ్రైవర్  హెల్మెట్  ధరించలేదని రూ.500 చలానా వేసారు పోలీసులు. సెప్టెంబర్ 11వ తేదీన గౌతమ బుధ్ధనగర్ పోలీసులు ఈ చలానా రాసినట్లు  నిరంకర్ సింగ్ చెప్పారు.  

ఈవిషయమై ట్రాన్స్ పోర్టు అధికారులను వివరణ అడిగితే మానవ తప్పిదం జరిగి ఉంటుందని, త్వరలో తప్పిదాన్ని సరిచేస్తామని చెప్పగా… పోలీసులు సాంకేతిక తప్పిదంగా వివరణ ఇచ్చారు. కాగా…ఇదే బస్సు యజమాని గతంలో నాలుగు పెండింగ్ చలాన్లు చెల్లించాల్సి ఉందని పోలీసులు చెప్పటం కొసమెరుపు.