దేశంలోనే తొలిసారి..ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక మెట్రో స్టేషన్..

  • Published By: nagamani ,Published On : June 25, 2020 / 05:25 AM IST
దేశంలోనే తొలిసారి..ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక మెట్రో స్టేషన్..

దేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటైంది. నోయిడాలోని సెక్టార్ 50 స్టేషన్‌ను ట్రాన్స్ జెండర్ల కోసం కేటాయించారు. దీనికి ‘Rainbow Station’ అని పేరు నిర్ణయించినట్లు నోయిడా మెట్రో రైలు కార్పొరేషన్ బుధవారం (జూన్ 24,2020)న తెలిపింది. 

ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణం చేసే వారికి, ఉద్యోగం చేసే వారికి అనుకూలమైన వాతావరణంతో అక్కడ ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ట్రాన్స్ జెండర్ల నుంచి..పలు ఎన్జీవోల నుంచి వచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేశామని నోయిడా అథారిటీ సీఈఓ, ఎన్‌ఎంఆర్‌సి మేనేజింగ్ డైరెక్టర్ రీతూ మహేశ్వరి వెల్లడించారు. ట్రాన్స్ జెండర్ల సాధికారతకు ఇది ఉపయోగపడుతుందని తాము భావిస్తున్నామని అన్నారు. 

ఇప్పటికే తమ సంస్థలో చాలా మందిట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపిన రీతూ  అందుకే వారికి ప్రత్యేకంగా స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ట్రాన్స్‌జెండర్‌ స్టాఫ్‌ అందరినీ అక్కడికి బదిలీ చేస్తామన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వారే పని చేస్తారని చెప్పారు. అంతేకాక ఆ స్టేషన్‌లో ఎక్కే ట్రాన్స్‌జెండర్‌ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అంతకు ముందు ‘షీ మ్యాన్’గా నామకరణం చేయగా అభ్యంతరాలు రావడంతో చివరకు ‘రెయిన్‌ బో’గా మార్చామని తెలిపారు.

కాగా సమాన హక్కుల కోసం ట్రాన్స్ జెండర్లు ఎంతో కాలం నుంచి పోరాటాలు చేస్తున్నారు. భారతదేశంలో 4.9 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని అంచనా. అందులో 30,000 నుండి 35,000 మంది ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో ఉన్నారని ఎన్ఎంఆర్సి ఎండి 2011 జనాభా లెక్కల ఆధారంగా తెలుస్తోంది. 

Read: దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు