సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా

  • Published By: veegamteam ,Published On : December 12, 2019 / 03:40 AM IST
సీఎం ఇంటిపై దాడులు, రైల్వే స్టేషన్ లకు నిప్పు : ఈశాన్యంలో CAB మంటలు

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు(CAB)తో ఈశాన్య భారతం అట్టుడికిపోతోంది. పౌరసత్వ బిల్లుకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అయ్యాయి. ముఖ్యంగా అసోంలో నిరసనలు మిన్నంటాయి. వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అసోం, త్రిపురలో వాహనాలను తగులబెట్టారు. అసోం సీఎం సోనేవాల్ ఇంటిపై నిరసనకారులు రాళ్ల దాడి చేశారు. చబువా, పాంటోలా రైల్వేస్టేషన్ లకు నిప్పు పెట్టారు. 

విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా అసోం, త్రిపుర రాష్ట్రాల్లో నిరసనకారుల ఆందోళనలు తీవ్రమయ్యాయి. పలుచోట్ల నిరసనకారులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల్లో అనేక మంది గాయపడ్డారు. ముస్లిమేతర వలసదారులకు భారతదేశ పౌరసత్వాన్ని కల్పించే ‘పౌరసత్వ సవరణ బిల్లు’ను పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. బుధవారం(డిసెంబర్ 11,2019) ఈ బిల్లు పెద్దల సభ ఆమోదం పొందింది.

అసోం, త్రిపురలో భారీగా కేంద్ర బలగాలు మోహరించారు. ఈశాన్య రాష్ట్రాల‌కు 5వేల మంది పారామిలిట‌రీ బ‌ల‌గాల‌ను తరలించింది కేంద్రం. త్రిపుర ప్ర‌భుత్వం ముందు జాగ్రత్తగా మొబైల్ ఇంట‌ర్నెట్‌, ఎస్ఎంఎస్ స‌ర్వీసుల‌ను 48గంట‌ల పాటు నిలిపివేసింది.

బీజేపీ పాలిత అసోం రాష్ట్రంలో యుద్ధ వాతావరణం నెలకొంది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా నిరసనకారులు దిష్టిబొమ్మలను దహనం చేశారు. టైర్లను తగలబెట్టారు. కాగడాల ప్రదర్శనలు నిర్వహించారు. డిస్పూర్‌, గువహతి, దిబ్రూగఢ్‌, జోర్హట్‌ లలో భారీ సంఖ్యలో ఉన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది లాఠీచార్జ్‌ చేసింది. ఈ ఘటనలో 25 మంది జర్నలిస్టులతో సహా అనేక మంది గాయపడ్డారు. ఈ సందర్భంగా వందలాది మంది నిరసనకారులను పోలీసులు నిర్బంధించినట్టు సమాచారం.

మరోపక్క రైల్వే సర్వీసులకు సైతం అంతరాయం ఏర్పడింది. దాదాపు 14 రైళ్లను రద్దు, దారి మళ్లించడం వంటివి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నిరసనలు జరుగుతుండటంతో అసోం సీఎం సర్భానంద్‌ సోనోవాల్‌ గువహతి ఎయిర్‌పోర్టులోనే కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ బంద్‌ కారణంగా జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రవాణా వాహనాలు రోడ్లెక్కలేదు. ఇక నాగాలాండ్‌లో హార్నబిల్‌ పండగ నేపథ్యంలో బంద్‌ లేదని ప్రధాన సంఘాలు ప్రకటించినా… నాగా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వందలాది మంది నిరసనకారులు రాజ్‌భవన్‌ను ముట్టించారు. రోడ్లమీదకు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ హక్కుల్ని కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌ నుంచి భారీ సంఖ్యలో హిందువులు కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. ఇప్పుడు వారందరికీ ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా పౌరసత్వం వస్తుంది. ఇది ఆ ప్రాంతంలోని జనాభా స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే భయం వ్యక్తమవుతోంది. దీంతో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ బిల్లు ముస్లిం శరణార్థులకు వర్తించదు. ఇప్పటికే అసోం పౌర రిజిస్టర్‌ ద్వారా ఎందరో దేశ పౌరసత్వాన్ని కోల్పోయారు. దశాబ్దాల తరబడి ఇక్కడ ఉంటున్న మైనారిటీల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళన కొందరిలో నెలకొంది.